బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 16 నవంబరు 2021 (10:47 IST)

నేడు జాతీయ ప‌త్రికా దినోత్స‌వం... ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు

దేశ ప్ర‌ధానితోపాటు, ప‌లువురు నేత‌లు నేడు పత్రికా సంపాదకులకు, పాత్రికేయ మిత్రులకు జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అసువులు బాసిన సంపాదకులకు, విలేఖరులకు  నివాళులర్పిస్తున్నారు. ఇటీవ‌ల కొవిడ్ మ‌హ‌మ్మారికి ఎంతో మంది పాత్రికేయులు బ‌ల‌య్యారు. ఈ వ్యాధిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు, వ్యాధి బారిన ప‌డిన వారికి వైద్య స‌హాయం క‌ల్పించ‌డం, లాక్ డౌన్ స‌మ‌యంలో పేద‌ల‌కు ఆహారం, సామాజిక స‌హాయం క‌ల్పించ‌డంలోనూ పాత్రికేయులు ప్ర‌ముఖ పాత్ర వ‌హించారు.
 
 
భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 16న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబరు 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసారు. ప్రభుత్వానికి ఉండే మూడు అంగాల (లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటివ్‌, జుడిషియరీ) తో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యానికి అత్యావశ్యకమైనది పత్రికాస్వేచ్ఛ.
 
 
అందుకే ప‌త్రిక‌ల‌ను నాల్గవ అంగంగా, నాలుగవ స్తంభంగా ఫోర్త్ ఎస్టేట్ గా పేర్కొన్నారు. ఫోర్త్‌ ఎస్టేట్‌ అంటే పత్రికలు లేదా ప్రసార మాధ్యమాలు. 1729-1797 సంవత్సరాల మధ్య జీవించిన ఆంగ్లో ఐరిష్‌ పొలిటికల్‌ థియరి ఎడ్మండ్‌ బ్రూక్‌ మొదటి సారిగా పత్రికలను ఉద్దేశించి పౌరుష పదజాలంతో శక్తి అన్న పదాన్ని ప్రయోగించాడు. రాజకీయాలలోనూ, పరిపాలనలోనూ స్వచ్ఛత విలసిల్లడానికీ, పరుగెత్తే కాలంతో సమాంతరంగా ప్రజల ముంగిటికి వార్తలు అందించే విలేకరులు ప్రతి దినం ఎన్నోదాడులను, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కొందరు జైళ్ల పాలవుతున్నారు, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజానికి ఒక దిక్సూచి పాత్రికేయ రంగం. సమాజ పునరిన్నర్మాణం లక్ష్యంగా పాత్రికేయులు ముందుకు వెళ్ళాలి.