రాష్ట్రంలోనూ, దేశంలోనూ పర్యాటకరంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తుందని, పర్యాటక రంగం కోవిడ్-19 వల్ల తీవ్రంగా నష్టపోయిందని, ఈ విషయాలన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వారి ఆదేశాల మేరకు పాలసీని రూపొందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.
పెట్టుబడుదారులకు ప్రోత్సాహకరంగా వుండే పాలసీని తెస్తున్నామని ముఖ్యమంత్రి ఆమోదం పొందగానే వచ్చేవారం పాలసీని ప్రకటిస్తామని, దేశ విదేశాల నుండి వస్తున్న పర్యాటకులకు మరింత ఆహ్లదకరంగా వుండేలా ఈ పర్యాటక ప్రాంతాలలో మౌలిక వసతులు అభివృద్థి చేయడం, రవాణా సదుపాయాలు, కమ్యునికేషన్ సదుపాయాలు, భద్రత కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు.
కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) ఆధ్వర్యంలో వర్చువల్ ప్లాట్ ఫామ్ లో టూరిజం కాంక్లేవ్ - 2020 జరిగింది . దాంట్లో కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ కార్యదర్శులు, రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు, వివిధ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న పారిశ్రామిక వేత్తలకు, పర్యాటక రంగాన్ని పరిశ్రమగా అభివృద్థి చేసేందుకు “సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామని, రాష్ట్రానికి మరింత ఆదాయం సంపాదించే విధంగా అభివృద్థి చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్థి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఎ.పి.టూరిజం అధారిటీ సి.ఈ.ఓ. ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగం పునరుత్తేజం ప్రధానంగా ౩ అంశాలపై ఆధారపడి వుందని తెలిపారు. ఆరోగ్య, రక్షణ పరమైన “స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసింజర్స్” లను ఖచ్చితంగా పాటించేలా స్టేక్ హోల్డర్లయిన హోటళ్లు, రెస్టారెంట్లు, టూరు ఆపరేటర్లు, అడ్వెంచర్ మరియు వాటర్ స్పోర్ట్స్ ఆపరేటర్లకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
పర్యాటక శాఖ, స్టేక్ హోల్డర్లతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను మదింపు చేసి, తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పర్యాటకులకు ఉపయుక్తమైన వీకెండ్, షార్ట్ ట్రిప్పులు, ఆరోగ్యం ప్రకృతి సంబంధిత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వర్చువల్ టూర్లు, వీడియోలను రూపొందించి డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ మాజీ కార్యదర్శి వినోద్ జుట్షి, ఇండియన్ స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటి సి.ఇ.ఓ. దిలీప్ పూరీ, సి.ఐ.ఐ.-ఆంధ్రప్రదేశ్ చైర్మన్ డి.రామకృష్ణ , సి.ఐ.ఐ.-ఆంధ్రప్రదేశ్ కో కన్వీనర్ తరుణ్ కాకానీ పాల్గొన్నారు.
సమావేశంలో వివిధ కీలక అంశాలపై జరిగిన చర్చల్లో ప్యానలిస్టులుగా టాటా ట్రస్ట్ టూరిజం హెడ్, మృదుల తంగిరాల, ఎడ్వంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు కెప్టెన్ స్వదేశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటీ డైరెక్టర్ డా.వి.సాంబశివరాజు, కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ దక్షిణ ప్రాంత డైరెక్టర్ సంజయ్ శ్రీవాత్స పాల్గొని పర్యాటక రంగ పురోగతిపై చర్చించారు. డిజిటల్ మోడ్‌లో జరిగిన ఈ కాంక్లేవ్‌లో 60 మంది పాల్గొన్నారు.