త్వరలో విజయవాడలో డిజిటల్ స్టూడియోను ప్రారంభించనున్నామని, ఈ స్టుడియో ద్వారా ఎప్పటికప్పుడు వ్యవసాయం రంగంలో జరుగుతున్న పరిశోధనలు, నూతన వంగడాలు, పరిజ్ఞానాన్ని రైతులకు శాస్త్రవేత్తల ద్వారా అందజేయనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్శిటీతో కలిసి విత్తన గ్రామం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. దీనివల్ల రైతులే స్వయంగా నాణ్యమైన విత్తనాలు తయారు చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో 2020-21 వ్యవసాయ పంచాంగాన్ని మంత్రి కన్నబాబు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల చెంతకు వ్యవసాయ పరిజ్ఞానం తీసుకెళ్లాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఇందుకోసమే ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాల(ఆర్.బి.కె)ను నెలకొల్పారన్నారు.
ఆర్బీకే కేంద్రాలను రైతు విజ్ఞాన కేంద్రాలుగా రైతులకు ఎప్పటికప్పుడు ఆధునిక వ్యవసాయం, పరిజ్ఞాన్ని అందించేలా రూపకల్పన చేస్తున్నామన్నారు. పొలంబడి, తోటబడి, మత్స్య సాగుబడి వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టామన్నారు.
డిజిటల్ స్టూడియోతో రైతుల చెంతకు సాగు పరిజ్ఞానం...
పుస్తకాల్లో నిక్షిప్తమైన పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఇందుకోసం విజయవాడలో డిజిటిల్ స్టుడియోను త్వరలో ప్రారంభించనున్నామన్నారు.
ఈ స్టుడియో ద్వారా వ్యవసాయం రంగంలో పరిశోధనలు, మెళకువలు, నూతన వంగడాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తల అభిప్రాయాలు, శిక్షణలు అందించనున్నామన్నారు. ఆర్బీకే కేంద్రాల్లో రైతులకు ఈ స్టుడియోల ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను అందబాటులో ఉంచుతామన్నారు.
మార్కెటింగ్ వివరాలను కూడా అందించనున్నామన్నారు. శాస్త్రవేత్తలే స్వయంగా వ్యవసాయ పరిజ్ఞాన్ని అందివ్వడం వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని మంత్రి తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్శిటీ రూపొందించిన వ్యవసాయ పంచాంగం సాగు, మార్కెటింగ్ సదుపాయాలకు సంబంధించి రైతులకు ఎంతో పరిజ్ఞానాన్ని అందిస్తుందన్నారు.
ఏ సీజన్ లో ఏయే పంటలు సాగు చేయాలి... భూసార పరీక్షలు... మార్కిటింగ్ వివరాలు... నూతన వంగడాలు వంటి ఎన్నో అంశాలు ఆ పంచాంగంలో పొందుపర్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న 10,641 ఆర్బీకే కేంద్రాలకు వ్యవసాయ పంచాంగాన్ని సరఫరా చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
విత్తన గ్రామంతో నాణ్యమైన విత్తనాల తయారీ...
రైతులే స్వయంగా విత్తనాలు తయారు చేసుకునేలా విత్తన గ్రామం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్శిటీతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు.
మూల విత్తనాన్ని యూనివర్శిటీ ద్వారా అందజేసి, రైతులే స్వయంగా విత్తనాల తయారు చేసుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు రైతులకు చేరినప్పుడే అవి సార్థకమవుతాయన్నారు.
ఈ నెలాఖరు నాటికి పంట నష్టం సర్వే పూర్తి...
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో తీవ్ర పంట నష్టం జరిగిందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. పంట నష్ట వివరాల సేకరణ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టామన్నారు. ఈ నెల 31వ తేదీ నాటికి పంట నష్ట సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
పంట నష్టం గుర్తింపులో నష్టపోయిన ప్రతిరైతు వివరాలను పొందుపర్చాలని స్పష్టంచేశారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ, వ్యవసాయ పంచాంగం రూపకల్పనలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్శిటీ అధికారుల పాత్ర అభినందనీయమన్నారు. రైతులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో పంచాంగం తీసుకొచ్చారన్నారు.
రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందివ్వడం ద్వారా అధిక దిగుబడులతో పాటు ఆదాయం పెంపుదలకు అవకాశం కలుగుతుందన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఏటా ఉగాది సందర్భంగా వ్యవసాయ పంచాంగం ఆవిష్కరిస్తుంటామన్నారు. కొవిడ్ కారణంగా ఈ ఏడాది ఆలస్యమైందన్నారు.
రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయోత్పత్తుల పెంపుదలకు కృషి చేస్తామన్నారు. ల్యాబ్ ల్లో రూపుదిద్దుకుంటున్న పరిశోధనలు ఎప్పటికప్పుడు రైతులకు అందినప్పుడే అవి సత్ఫలితాలిస్తాయన్నారు.
రాష్ట్రంలో ఉన్న ఆర్బీకే కేంద్రాల ద్వారా ప్రభుత్వంతో కలిసి విత్తనాల తయారీకి రైతులకు శిక్షణివ్వనున్నామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ త్రిమూర్తులు, యూనివర్శిటీ అధికారులు డాక్టర్ గిరిధర్ కృష్ణ, రాంబాబు, సైంటిస్ట్ గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు.