శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (07:46 IST)

రైతులకు బేడీలు వేసిన కానిస్టేబుళ్లు సస్పెన్షన్

రిమాండ్ ఖైదీలుగా వున్న రైతులకు బేడీలు వేసిన కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను వదిలేసి తూతూమంత్రంగా చర్యలు చేపట్టింది.

ఈ ఘటనకు కారణమైన పోలీస్ వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకున్న గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ.. '27 తేదీ నాడు నరసరావుపేట ప్రత్యేక మొబైల్ కోర్టు వారి ఆదేశాల మేరకు నరసరావుపేట సబ్ జైల్ నందు వివిధ కేసులలో ముద్దాయిలుగా ఉన్న 43 మంది రిమాండ్ ఖైదీలను కరోనా నిర్ధారణ పరీక్షల అనంతరం జిల్లా జైలు, గుంటూరుకు తరలించు నిమిత్తం ఏఆర్ సిబ్బందితో కూడిన ప్రిజనర్స్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయబడినది.

ప్రిజనర్స్ ఎస్కార్ట్ నిమిత్తం విధులలో ఉన్న పోలీస్ వారు 43 మంది రిమాండ్ ఖైదీలను నరసరావుపేట సబ్ జైలు నందు స్వాధీనం చేసుకుని,వారిని జిల్లా జైలు,గుంటూరుకు బస్సులో తరలించారు.
 
 ఈ తరలించే క్రమంలో రిమాండ్ ఖైదీలకు సంకెళ్ళు వేశారు. ఆ 43 మంది రిమాండ్ ఖైదీలలో 7 మంది  మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు అనగా ధర్నాలకు వస్తున్న వారిని ట్రాక్టర్లు అడ్డుపెట్టి, బెదిరించిన కేసులో ముద్దాయిలు ఉన్నారని తెలిసింది.
 
 రిమాండ్ ఖైదీలకు సంకెళ్ళు వేసిన విషయం తెలిసిన వెంటనే, ఈ ఘటనకు సంబంధించి ఎస్కార్ట్ విధుల్లో ఉన్న 6 మంది హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని, ఆర్ ఎస్సై మరియు ఆర్ఐ లకు ఛార్జ్ మెమోలు జారీ చేయడం జరిగినదని తెలిపారు.
 
అదే విధముగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు నిమిత్తం  అదనపు ఎస్పీ (ఏఆర్) స్థాయి అధికారిని విచారణా అధికారిగా నియమించి,రిపోర్ట్ కోరడం జరిగినదని  తెలిపారు.
 
ఈ లాంటి ఘటనలు జరగడం దురదృష్ట కరమని,ఇవి మరల పునరావృతం కాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏఆర్ అదనపు ఎస్పీ కి, ఏఅర్ డిఎస్పీ కి ఆదేశాలు జారీచేశామని తెలిపారు.