సోమవారం, 4 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఆగస్టు 2025 (10:58 IST)

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ajith kumar
కోలీవుడ్ అగ్రహీరో అజిత్ కుమార్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఏకంగా 33 యేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ఒక ఎమోషనల్ నోట్‌ను విడుదల చేశారు. జీవితంలో అనేక మానసిక ఒత్తిడులు, ఎదురు దెబ్బలు, వైఫల్యాలు పరీక్షించాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన పోస్ట్‌లోని సారాంశాన్ని పరిశీలిస్తే, 
 
'సినిమా అనే కష్టమైన ఇండస్ట్రీలో నేను 33 ఏళ్లు పూర్తిచేసుకున్నాను. ఈ సందర్భంగా మీతో ఎన్నో విషయాలు పంచుకోవాలనుంది. గడిచిన ప్రతి సంవత్సరం కూడా నాకో మైలురాయితో సమానం. అందుకే మరిన్ని మైలురాళ్ల కోసం ఎదురుచూస్తున్నాను. మీరంతా చూపించే ప్రేమకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావడంలేదు. ఇన్నేళ్ల నా ప్రయాణం ఎప్పుడూ సులభంగా సాగలేదు. 
 
నేను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు. బయటి వ్యక్తిగా వచ్చి ఈ స్థాయికి ఎదిగాను. జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిడిలు, ఎదురుదెబ్బలు, వైఫల్యాలు నిరంతరం పరీక్షించాయి. కానీ, నేను ఎప్పుడూ ఆగిపోలేదు. వాటిని ఎదుర్కొంటూనే ముందుకుసాగాను. అన్నిటినీ భరించి పడిలేచిన కెరటంలా మరింత ఉత్సాహంతో పనిని పూర్తి చేస్తున్నాను. పట్టుదలే నేను నమ్ముకున్న మార్గం. అదే నా బలం. 
 
సినిమాల్లో ఎన్నోసార్లు ఊహించలేనన్ని పరాజయాలు చూశాను. ఇక ముందుకుసాగలేనని అనుకున్న ప్రతిసారీ మీ ప్రేమే నన్ను ప్రోత్సహించింది. నా దగ్గర ఏమీ లేనప్పుడు, వరుస వైఫల్యాలు ఎదురైనప్పుడు కూడా మీరంతా నా వెంటే ఉన్నారు. ఇలాంటి విశ్వాసం చాలా అరుదు. ఇలాంటి గొప్ప అభిమానులు దొరకడం నా అదృష్టం. ఇక మోటారు రేసింగులోనూ ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. శారీరకంగా కూడా ఎన్నో గాయాలయ్యాయి. అక్కడ కూడా నన్ను ఎదగనీయకుండా ఆపేందుకు ఎంతోమంది ప్రయత్నించారు. అవమానించారు, పరీక్షలు పెట్టారు. కానీ నేను పతకాలు సాధించే స్థాయికి ఎదిగాను. ధైర్యంగా ముందడుగు వేస్తే ఏదైనా సాధ్యమేనని నిరూపించాను. 
 
'నా భార్య షాలిని లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. ఆమె ఎప్పుడూ నా వెంటే నిలిచింది. అభిమానుల ప్రేమ గురించి మాటల్లో వర్ణించలేను. మీ ప్రేమను నేను ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించలేదు. అందరిలా ఎక్కువ సినిమాలు తీయకపోవచ్చు.. ఎప్పుడూ మీతో మాట్లాడుతూ ఉండకపోవచ్చు.. కానీ మీ ప్రేమను ప్రతిక్షణం ఆస్వాదిస్తూనే ఉంటాను. 33 ఏళ్లుగా మీరు నన్ను, నాలోని లోపాలను అన్నింటినీ అంగీకరించారు. మీతో ఎప్పటికీ నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తాను. మోటారు రేసింగులోనూ మనదేశం గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను' అని అజిత్ కుమార్ రాసుకొచ్చారు.