నా మరదలంటే నాకు పిచ్చి ప్రేమ, పెళ్లి చేయకపోతే టవర్ పైనుంచి దూకి చస్తా: బావ డిమాండ్, ఏమైంది? (video)
ఓ బావ తన మరదలిపై మనసు పారేసుకున్నాడు. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టాడు. ఐతే అందుకు అతడి అత్తమామలు ససేమిరా అన్నారు. తన అసంబద్ధ కోరికను తీర్చుకోవడానికి, అతను 33 వేల వోల్టుల విద్యుత్ టవర్ ఎక్కాడు. అతడలా హై టెన్షన్ విద్యుత్ లైన్ ఎక్కడాన్ని చూసి చుట్టూ గందరగోళం నెలకొంది. అక్కడికి పోలీసులు, పరిపాలనా సిబ్బంది వచ్చారు. దాదాపు 7 గంటల పాటు కొనసాగిన ఈ హై వోల్టేజ్ డ్రామాను చూడటానికి జనం గుంపుగా వచ్చారు. ఆ యువకుడు టవర్ పై నుండి తనకు తన మరదలు కావాల్సిందేనంటూ చెప్తూనే వున్నాడు. తను కిందకు దిగి రావాలంటే తనకు మరదలినిచ్చి వివాహం చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాడు.
ఈ కేసు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని చిబ్రామౌ కొత్వాలి ప్రాంతంలోని కళ్యాణ్‌పూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. అక్కడ రాజ్ సక్సేనా అనే యువకుడు తన మరదలని ప్రేమించాడు. 28 ఏళ్ల రాజ్ ఇప్పటికే రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. మొదటి వివాహం కొన్ని సంవత్సరాల క్రితం లాలీతో జరిగింది, కానీ ఆమె మరణించింది, ఆ తర్వాత రాజ్ తన మొదటి మరదలు, లాలీ సోదరి సప్నాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక కుమార్తె ఉంది. ఒక సంవత్సరం వయసున్న కుమార్తె తండ్రి అయిన రాజ్ తన ఇంటికి వస్తూపోతూ వుండే 2వ మరదలు చాందినిపై కన్నేసాడు. ఆమెను కూడా తనకిచ్చి వివాహం చేయాలంటూ పట్టుబట్టాడు.
చాందిని కుటుంబం అతని డిమాండ్‌ను తిరస్కరించింది, భార్య సప్నా కూడా తన సోదరిని వివాహం చేసుకోవాలన్న భర్త కోర్కె విని ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని నోటికి వచ్చినట్లు తిట్టింది. దీనితో... నువ్వు ఎన్ని తిట్టినా నాకు చాందిని కావాల్సిందే. లేదంటే ఏం చేస్తానో చూడండి అంటూ గురువారం ఉదయం 9 గంటలకు వ్యవసాయ భూముల్లో వున్న 33 వేల వోల్ట్ల హైటెన్షన్ టవర్ ఎక్కాడు. ఆ తర్వాత పైనుంచి మాట్లాడుతూ... ఇప్పటికిప్పుడు ఇక్కడే ఈ స్తంభాల మధ్య నాకు చాందినిని ఇచ్చి పెళ్లి చేయండి. లేకపోతే ఇక్కడి నుంచి నేను దూకి చస్తానూ అంటూ చెబుతూనే ఉన్నాడు.
అక్కడ గ్రామస్తులు గుమిగూడారు. పోలీసులు, అగ్నిమాపక దళం, విద్యుత్ శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా, ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చాలాసేపు అతడితో మంతనాలు జరిపినప్పటికీ అతడు ఎంతమాత్రం కిందికి దిగిరాలేదు. చివరకు చాందిని కుటుంబం అతడి డిమాండుకి తలొగ్గి తమ మూడో కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తామని హామీ ఇచ్చింది. భార్య సప్న తన సోదరి చాందినితో రాజ్ వద్దకు చేరుకుంది, రాజ్ తల్లి, ఇకనైనా కిందికి దిగి రారా, చాందిని వచ్చింది అని చెప్పింది. 7 గంటల పాటు జరిగిన ఈ హై వోల్టేజ్ డ్రామా తర్వాత, అతను తన భార్య సప్నాతో పాటు తన మరదలు చాందిని ఇద్దరినీ తనతో రావాలంటూ విద్యుత్ టవర్ పైనుంచి కిందికి దిగాడు. ప్రస్తుతం, పోలీసులు యువకుడిని విచారిస్తున్నారు. అతని మానసిక స్థితిని కూడా తనిఖీ చేస్తున్నారు.