బంగ్లాదేశ్, పాక్ యువతులకు 3.5 కోట్ల మంది చైనా బ్యాచిలర్స్ వల, ప్లీజ్ మమ్మల్ని పెళ్లాడండి
ఒకప్పుడు వరసబెట్టి పిల్లల్ని కంటూ చైనాను పేదరికంలో పడేస్తారా అంటూ అక్కడి ప్రభుత్వం ఒక్క బిడ్డ చాలు అంటూ కఠినమైన నిబంధనలు విధించింది. ఫలితంగా అక్కడ హఠాత్తుగా జనాభా పెరుగుదల రేటు తగ్గిపోయింది. ఇంతలో జనాభాలో నెం.1 స్థానాన్ని కాస్తా భారతదేశం తన్నుకెళ్లిపోయింది. ఇదిలావుంటే ఇప్పుడు చైనాలో కనీసం 3.5 కోట్ల మంది పెళ్లికాని ప్రసాదులు వున్నారని గణాంకాలు చెబుతున్నాయి. చైనా అప్పట్లో విధించిన తెలివితక్కువ నిబంధన వల్ల స్త్రీపురుష నిష్పత్తిలో దారుణమైన తారతమ్యాలు వచ్చాయి. స్త్రీల సంఖ్య విపరీతంగా పడిపోయింది.
ఫలితంగా ప్రస్తుతం చైనాలో మూడున్నరకోట్ల మంది యువకులు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరకడం లేదు. దీనితో ఏం చేయాలో పాలుపోని చైనా పెళ్లికాని ప్రసాదులు... బంగ్లాదేశ్, పాకిస్తాన్, రష్యా దేశాల వైపు చూస్తున్నారట. ఎంత ఖర్చయినా పెట్టి భార్యగా అంగీకరించే అమ్మాయిలను కొనుగోలు చేసుకునేందుకు ప్రపంచమంతా దేశదిమ్మరుల్లా తిరుగుతున్నారట.
మరోవైపు ఒకే బిడ్డ నినాదాన్ని చైనా ప్రభుత్వం 2015లో ఎత్తివేసింది. ఐనప్పటికీ అక్కడి ప్రజలు పూర్తిగా ఒక బిడ్డ ఫార్ములాకి అలవాటు పడి పెళ్లయ్యాక కేవలం ఒక్క సంతానాన్ని మాత్రమే జన్మనిచ్చి ఆ తర్వాత పిల్లలను కనేందుకు ఆసక్తి చూపించడంలేదు. ఆన్లైన్లో చైనా బ్యాచిలర్స్ ప్రకటనలు ఇస్తున్నారు. తమను పెళ్లాడే యువతులకు ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకుంటామని. ఇందులో మొదటివరసలో బంగ్లాదేశ్ వున్నదట.
అక్కడ పేదరికంలో మగ్గిపోతున్న యువతులను మధ్యవర్తుల ద్వారా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఐతే చైనా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తోంది. ఎవరైనా విదేశీ అమ్మాయిలను భార్యలుగా చేసుకునేందుకు డబ్బు చెల్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. దీనితో చైనా బ్యాచిలర్స్ అక్కడి ప్రభుత్వంపైన చిందులు తొక్కుతున్నారట.