1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 మే 2025 (19:18 IST)

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

people of Sindh chasing and beating Pakistani police
పాకిస్తాన్ దేశంలోని సింధ్ ప్రాంత ప్రజలు పాకిస్తాన్ పోలీసులను పరుగులుపెట్టించి కర్రలు, బండలతో కొడుతూ వెంటబడుతున్నారు. ప్రజలు దాడి చేస్తుండటంతో పోలీసులు పారిపోతున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ లంజార్ ఇంటిని నిరసనకారులు తగలబెట్టారు. సింధు నది నుండి నీటిని మళ్లించే ప్రాజెక్టుకి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా హింస చెలరేగింది.
 
నౌషెహ్రో ఫిరోజ్‌లో పోలీసులు, జాతీయవాద సంస్థ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు, అనేక మంది గాయపడ్డారు. కాలువ నిర్మాణంపై స్థానిక ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ భూమిని, నీటిని సైనికాధికారులు లాక్కుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. నిరసనకారులు హైవేపై ధర్నా చేశారు, పోలీసులు వారిని అడ్డుకున్నారు, ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
 
నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో వారు మరింత ఆగ్రహం చెందారు. ఏకంగా మంత్రి లంజార్ ఇంటికి నిప్పు పెట్టేసారు. ఇంటికి కాపలాగా వున్న సెక్యూరిటీ గార్డులను కర్రలతో బాదారు. అడ్డు వచ్చినవారిని వచ్చినట్లు దేహశుద్ధి చేసారు. పోలీసు ట్రక్కుల్లో వున్న ఆయుధాలను దోచుకున్నారు. తుపాకులను చేతబూని పోలీసులపై గురిపెట్టారు. దీనితో భయభ్రాంతులకు గురైన పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీస్తూ పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.