1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 మే 2025 (18:26 IST)

పాకిస్తాన్ మంత్రి హసన్ లంజార్ ఇంటికి నిప్పు, దరిద్రుడు మా నీళ్లు మళ్లిస్తున్నాడంటూ సింధ్ ప్రజలు ఫైర్

Sindh residents set fire to Pakistani minister Hassan Lanzar's house
పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. తమ ప్రాంతానికి వచ్చే నీళ్లను ప్రాజెక్టు నిర్మించి పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌కి మళ్లించేందుకు పాకిస్తాన్ సింధ్ హోం మంత్రి జియా ఉల్ హసన్ లంజార్ కుట్ర చేస్తున్నారంటూ అక్కడి ప్రజలు మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. అంతేకాదు... దరిద్రుడు, మా పాలిట పడ్డ పనికిమాలిన మంత్రి అంటూ దూషించారు. ఇంకొందరైతే రోడ్లపైకి వచ్చి AK 47 తుపాకులను చేతపట్టుకుని మా నీళ్లను ఎలా మళ్లిస్తారో చూస్తాం అంటూ ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణల్లో కనీసం ఇద్దరు పాకిస్తాన్ పౌరులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం తమ ప్రాంతానికి వస్తున్న నీరే తమకు సరిపోవడం లేదనీ, అలాంటిది ఈ నీటిని మరో ప్రాంతానికి ఎలా తరలిస్తారంటూ సింధ్ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మా ప్రాంత రైతులు పంటలకు నీళ్లు లేక విలవిలలాడుతుంటూ చూడాలని అనుకుంటున్నారా... అది ఎంతమాత్రం సాధ్యం కాదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
సింధ్ ప్రజల దెబ్బకు జడుసుకున్న మంత్రి పారామిలటరీ బృందాలను రంగంలోకి దింపారు. హింసాయుత కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని అణచివేయాలంటూ ఆదేశాలు జారీ చేసారు. దీనితో సింధ్ ప్రజలు మరింత ఆగ్రహం చెంది మిలటరీ బలగాలపై ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి  అల్లకల్లోలంగా వున్నట్లు సమాచారం.