అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్
ఒక్క జాతీయ పురస్కారాలనే కాదు.. ఏ ఒక్క అవార్డును కూడా తాను నమ్మనని హీరో విశాల్ అన్నారు. 'యువర్స్ ఫ్రాంక్లీ విశాల్' పాడ్‌కాస్ట్‌లో అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, తన సినిమా కెరీర్‌లో అత్యంత కఠినమైన సవాల్ విసిరిన పాత్ర 'అవన్ - ఇవన్' (తెలుగు టైటిల్ వాడు- వీడు) అని, భవిష్యత్‌లో ఎన్ని రూ.కోట్లు ఆఫర్ చేసినా అలాంటి పాత్రలో మళ్లీ నటించే ప్రసక్తే లేదని విశాల్ అన్నారు. ఆ రోల్ కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమపడ్డానని తెలిపారు.
దర్శకుడు బాలా తెరకెక్కించిన ఈ సినిమాలో ఆర్య మరో హీరో. 2011లో విడుదలైంది. తనకు అవార్డులపై నమ్మకం లేదన్నారు. 'జాతీయ పురస్కారాలు సహా నేను అవార్డులను నమ్మను. జ్యూరీగా ఉండే ఏడెనిమిది మంది బెస్ట్ యాక్టర్, బెస్ట్ మూవీని ఎలా డిసైడ్ చేస్తారు? ఓ సర్వే నిర్వహించి ప్రేక్షకుల అభిప్రాయాలు సేకరించాలి. అలా చేయడం ముఖ్యం. నాకు అవార్డు రాలేదనే ఉద్దేశంతో ఇదంతా చెప్పడం లేదు. ఒకవేళ నాకు ఏదైనా అవార్డు వచ్చినా దాన్ని డస్ట్‌బిన్‌లో వేస్తా. అది బంగారంతో తయారు చేయించిందైతే.. దాన్ని అమ్మేసి, వచ్చిన డబ్బును ఛారిటీకి విరాళం ఇస్తా' అని పేర్కొన్నారు.
సినిమాల్లో ఎంత కష్టమైన స్టంట్స్ అయినా చేస్తానని, డూప్‌తో చేయించడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు. యాక్షన్ స్వీక్వెన్స్ చిత్రీకరించే క్రమంలో గాయాలు కాగా ఇప్పటి వరకూ తనకు 119 కుట్లు పడ్డాయని తెలిపారు. ఈ పాడ్‌కాస్ట్ ప్రోమో శనివారం ఉదయం యూట్యూబ్‌లో విడుదల కాగా.. ప్రస్తుతం ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. 'మకుటం', 'తుప్పరివాలన్ 2' చిత్రాలతో బిజీగా ఉన్న విశాల్.. సుందర్ సి. దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా చేయనున్నారని సమాచారం.