ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు
దీపావళి పండుగ అంటేనే మతలాబులు, స్వీట్ల పండగ. ఈ పండగ వేళ స్వీట్ల సందడి మామూలుగా ఉండదు. ప్రముఖ దుకాణాలాన్ని భారీ మొత్తంలో స్వీట్లు తయారుచేసి విక్రయిస్తుంటాయి. అయితే, జైపూర్‌లోని ఓ దుకాణంలో అమ్ముతున్న ఒక స్వీట్ ధర తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దాని పేరు 'స్వర్ణ ప్రసాదం'. ధర అక్షరాలా రూ.1.11 లక్షలు! ప్రస్తుతం దేశంలోనే అత్యంత ఖరీదైన మిఠాయి ఇదేనని చెబుతున్నారు.
ఈ స్వీట్ తయారీలో వాడే పదార్థాల వల్లే దీనికి ఇంత ధర వచ్చిందని దుకాణం యజమాని అంజలి జైన్ తెలిపారు. దీని తయారీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన స్వర్ణ భస్మాన్ని (తినే బంగారం) వాడుతున్నామని ఆమె వివరించారు. దీనికి తోడు అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్ అయిన చిల్గోజా (పైన్ నట్స్), మేలిమి కుంకుమపువ్వును కూడా జోడిస్తున్నట్లు చెప్పారు. కేవలం స్వీట్ మాత్రమే కాదని, దాని ప్యాకింగ్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని, అందమైన జ్యువెలరీ బాక్స్‌లో పెట్టి అమ్ముతున్నామని ఆమె అన్నారు.
ఈ స్వీటులో వాడే బంగారు భస్మాన్ని ఒక జైన దేవాలయం నుంచి సేకరిస్తున్నామని, దీనిని ఆయుర్వేద సంప్రదాయాల ప్రకారం జంతు హింస లేకుండా తయారు చేస్తారని అంజలి జైన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ స్వర్ణ ప్రసాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. "ఇది తినడానికా లేక లాకర్లో పెట్టడానికా?" అని ఒకరు అడగ్గా, "బంగారం ధర తగ్గితే స్వీట్ ధర కూడా తగ్గుతుందా?" అని మరో యూజర్ ప్రశ్నించారు.