మంగళవారం, 21 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 అక్టోబరు 2025 (18:07 IST)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

jee - nta
జేఈఈ మెయిన్ పరీక్ష 2026 (JEEMain2026)కు సన్నద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. రెండు సెషన్లలో నిర్వహించే ఈ పరీక్ష తొలి సెషన్‌ను జనవరి నెలలో, రెండో సెషన్‌ను ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నారు. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించి షెడ్యూల్‍ను ఎన్.టి.ఏ ఆదివారం విడుదల చేసింది. జనవరి 21వ తేదీ నుంచి 30వ తేదీల మధ్య జేఈఈ మెయిన్స్-1, ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య రెండో సెషన్ పరీక్షను నిర్వహించనున్నట్టు ఎన్టీఏ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షకు ఈ నెల నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు వెబ్ సైట్‌లో అందుబాటులోకి వస్తాయని ఎన్టీఏ  వెల్లడించింది. సెషన్-2కు పరీక్షకు జనవరి నెలాఖరు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశ వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థుల హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం పరీక్షల నిర్వహణ కేంద్రాలను కూడా పెంచనున్నారు. దివ్యాంగ అభ్యర్థుల అవసరాలను తీర్చడంపై కూడా ఈ దఫా దృష్టి కేంద్రీకరించనున్నారు.