సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (17:27 IST)

రైతులకు చేసే సాయానికి పిచ్చి షరతులు పెడతారా?: టీడీపీ రైతు విభాగం

వరదలు, వర్షాలవల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2లక్షల04వేల ఎకరాల్లోవరిపైరు దెబ్బతిన్నదని, దానివల్ల రూ.810కోట్లవరకు ధాన్యం రైతులు నష్టపోయారని, 30వేలహెక్టార్లలో పత్తిని కూడా రైతాంగం కోల్పోయిందని, 74వేలఎకరాల పైచిలుకువరకు పత్తిపైరు పాడైందని, లక్షఎకరాల్లో కంది, మినుము, పెసర వంటి పంటలు దెబ్బతిన్నాయని, 60వేలఎకరాల్లోమొక్కజొన్నపంట దెబ్బతిన్న దని టీడీపీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ, గోదావరి జిల్లాల్లో  2లక్షలమెట్రిక్ టన్నుల దిగుబడినిచ్చే  వేరుశనగ పైరు సర్వనాశనమైందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం దిక్కుతోచని స్థితిలోపడితే, ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ, ఒట్టిమాటలతో కాలక్షేపం  చేస్తోందన్నారు. మంత్రులుకూడా దారుణంగా, బాధ్యతలేకుండా మాట్లాడుతూ, రైతులను మరింత కుంగదీస్తున్నారన్నారు. 

ఒక్కో కుటుంబానికి రూ.500సాయం చేస్తామన్న ప్రభుత్వం, ఆ సొమ్ము కూడా సదరుకుటుంబం పూర్తిగా వారంపాటు నీటిలో ఉండి ఇబ్బందిపడిఉంటేనే అందచేస్తామని ఈప్రభుత్వం చెప్పడం దారుణమని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.500కోసం కుటుంబం వారంపాటు నీళ్లలో ఉండాలనే ఆంక్షతో సమాజానికి ఎలాంటి సందేశమివ్వాలని ఈ ప్రభుత్వం చూస్తోందో చెప్పాలన్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ రైతులబాధలు విని చలించిపోయారని, వారితోపాటుతానుకూడా రైతుల బాధలను కళ్లారా చూడటం జరిగిందన్నారు. అరటి, చేమ, కంద, తమలపాకు, పసుపు, కూరగాయలపంటలు నీటిలో మునిగిపోయి పూర్తిగా కుళ్లిపోయాయన్నారు. పైర్లన్నీ నీళ్లపాలైనా ప్రభుత్వం ఇంతవరకు రెవెన్యూయంత్రాంగంద్వారా ఎటువంటి సహాయచర్యలు చేపట్టలేదన్నారు.

వరదనీటిలో కుళ్లినపంటల కారణంగా దుర్వాసన ఎక్కువై, అంటువ్యాధులు ప్రబలేఅవకాశం ఉందని తెలిసీకూడా ఆరోగ్యశాఖ సిబ్బందిని జగన్ ప్రభుత్వం ఇంతవరకు ప్రజల్లోకి పంపలేదన్నారు. మండలస్థాయి అధికారులు ఇప్పటివరకు తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం లేదంటున్నారు.

రైతుల వెతలను, వారు ఆరుగాలంపడిన కష్టాన్ని అపహాస్యం చేసేలా వ్యవసాయమంత్రి కన్నబాబు, మరోమంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వ్యవసాయ మంత్రి తనసొంతజిల్లాలో జరిగిన పంటనష్టాన్ని కూడా తెలుసుకోలేకపోతే ఎలాగన్నారు? లోకేశ్ పర్యటన తరువాతే వారు నోళ్లు తెరిచారని, అదికూడా రైతులను అవహేళన చేయడానికేనన్నారు.

చేతగాని ఈప్రభుత్వం, గత ప్రభుత్వాలు చేసిన దాన్ని చూసికూడా నేర్చుకోకపోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ హాయాంలో వచ్చిన ప్రకృతి వైపరీత్యాలకారణంగా, రైతులు కోల్పోయిన పంటలకు వందశాతం వరకు పరిహారం ఇవ్వడం జరిగిందన్నారు. 2014 నుంచి 2019వరకు దాదాపు రూ.3,728.18కోట్ల వరకు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో పరిహారం అందచేశారన్నారు.

చంద్రబాబునాయుడు రైతులకు అండగా నిలబడి, వారిని కష్టాల నుంచి గట్టెక్కించారన్నారు.  జగన్మోహన్ రెడ్డి అధికారంలోకివచ్చాక, ఇప్పటివరకు రైతులకు కేవలం రూ.67.34కోట్లను మాత్రమే పరిహారంగా అందచేసిం దన్నారు. మంత్రులేమో తలా ఒకలెక్క చెబుతూ, చేయని సాయాన్ని చేసినట్లుగా చెప్పుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులపై ఎంతటి చిత్తశుద్ధితోఉందో వారిచ్చిన రూ.67.34కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ లెక్కే చెబుతోందన్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా అబద్ధాలు, అసత్యాలతో కాలక్షేపం చేయకుండా, రైతులకు అండగా నిలిస్తే మంచిదని, ప్రభుత్వం ఆదిశగా ఆలోచనచేస్తే, ప్రతిపక్షం తరుపున తాముకూడా వారికి పూర్తిమద్ధతు తెలియచేస్తామని శ్రీనివాసరెడ్డి చెప్పారు. రూ.2494కోట్లవరకు రైతులు నష్టపోయారని, ఆ పరిహారం మొత్తాన్ని తక్షణమే వారికి అందేలా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

వరి చేతికొచ్చేదశలో నీళ్లపాలైందని ఎకరాకు రూ. 25 నుంచి రూ.30వేల వరకు సాయంచేస్తే తప్ప, రైతులు కోలుకోలేరన్నారు. అలానే ఉద్యానవన పంటలకు సంబంధించి, ఎకరాకి రూ.లక్షవరకు ఖర్చయిందని, కనీసవాటాగా రూ.50వేల వరకు పరిహారంగా అందించాలని మర్రెడ్డి డిమాండ్ చేశారు.

వారం రోజులు నీళ్లలో నానిన పంటలనే లెక్కలోకి తీసుకుంటామనే పిచ్చి షరతులను పక్కనపెట్టి, సర్వం కోల్పోయిన రైతులకు అండగా నిలిస్తే మంచిదన్నారు. ప్రభుత్వపెద్దలు, మంత్రులు ఇసుక, మద్యం వ్యాపారాలు, బెట్టింగులపై నుంచి కాస్త దృష్టిమరిల్చి, రైతులను పట్టించుకుంటే మంచిదని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు సూచించారు.