శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (16:17 IST)

దళారీ వ్యవస్థ నుంచి రైతులకు విముక్తి: రాజ్యసభలో విజయసాయి రెడ్డి

రైతు ఉత్పాదనల విక్రయ, వాణిజ్యానికి సంబంధించిన బిల్లుపై ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో  వి.విజయసాయి రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం అమలులో ఉన్న మార్కెట్ విధానం వలన రైతులు తమ ఉత్పాదనలకు న్యాయమైన ధర కోసం దళారీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన అన్నారు.

మార్కెట్‌ లో ధరలు ఒడిదుడుకులకు గురైనప్పుడల్లా దళారులు రైతు కష్టార్జితాన్ని దోచుకోవడానికి చూస్తుంటారు. ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటకు న్యాయమైన ధర చెల్లించకుండా దళారీలు తమ లాభాల స్వీకరణకే మొగ్గు చూపుతున్నందున దళారీ వ్యవస్థను నిర్మూలించి రైతు తమ ఉత్పాదనలకు ధరను తానే నిర్ణయించుకుని ఆ మేరకు వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఈ బిల్లు వలన కలుగుతుందని అన్నారు. 
 
కాంట్రాక్ట్‌ వ్యవసాయ విధానాన్ని అనుమతించడం ద్వారా మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులతో నిమిత్తం లేకుండా ముందుగా నిర్ణయించిన ధరకే రైతు తన ఉత్పాదనలు అమ్ముకోగల సౌలభ్యాన్ని ఈ బిల్లు కల్పిస్తోందని చెప్పారు. రైతులు ఇప్పటి వరకు మార్కెట్‌లో లైసెన్స్‌ పొందిన ట్రేడర్లకు మాత్రమే తమ ఉత్పాదనలు విక్రయించాలి.

ఈ నిబంధనను ఆసరాగా తీసుకుని ట్రేడర్లు కుమ్మకై రైతుల పంటకు అతి తక్కువ ధరను కొనుగోలు చేస్తూ రైతుకు న్యాయమైన ధర దక్కకుండా చేస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితి ఇకపై కొనసాగదు. రైతులు తమ పంటలను విక్రయించడానికి వ్యక్తులు లేదా కంపెనీలతో ముందుగానే ఒప్పందం చేసుకోవచ్చు. ఏపీఎంసీ మార్కెట్‌ చట్టాలు కేవలం మార్కెట్‌కు మాత్రమే పరిమితం అవుతాయి.

మార్కెట్‌ వెలుపల రైతులు తమకు ఇష్టం వచ్చిన వ్యక్తులు లేదా కంపెనీలతో ముందస్తు ఒప్పందం చేసుకుని తమ ఉత్పాదనలను విక్రయించుకునేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఏపీఎంసీ చట్టం ప్రకారం రైతు తన పంటలను నిర్దేశితి మార్కెట్‌లోనే విక్రయించాలి. పొరుగు జిల్లాలో తనకు సమీపంలోనే ఏపీఎంసీ మార్కెట్‌ ఉన్నప్పటికీ అక్కడ రైతుకు ప్రవేశం ఉండదు. ఈ బిల్లుతో ఏపీఎంసీ నియంతృత్వ విధానానికి శాశ్వతంగా తెరపడుతుందని విజయసాయి రెడ్డి అన్నారు.

ఇక ఈ బిల్లులోని క్లాజ్‌ 2లో వ్యవసాయ ఉత్పాదనల కింద అన్ని రకాల ఆహార ధాన్యాలు, నూనె, పత్తి, పౌల్ట్రీ ఉత్పాదనలు చేర్చి పొగాకును ఎందుకు విస్మరించారని ఆయన ప్రశ్నించారు. ఎగుమతులకు ఉద్దేశించే పొగాకును కూడా కాంట్రాక్ట్‌ సాగు పరిధిలోకి అనుమతించాలంటూ ఆయన వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో రైతు సంక్షేమ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా ఆయన సభలో ఉటంకించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోని ఆర్‌ అనే అక్షరం రైతాంగానికి చిహ్నమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం కింద 49 లక్షల మంది రైతులకు ఏటా 13,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.

దేశంలో రైతులకు ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే అన్నారు. పంటల ధరలలో ఏర్పడే హెచ్చు తగ్గుల వలన రైతాంగం నష్టపోకుండా 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరను హామీ ఇస్తోందని తెలిపారు.

ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నయవంచనకు పాల్పడుతోందని విజయసాయి రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే వ్యవసాయ మార్కెట్‌లను సంస్కరించి, కార్పొరేట్‌ వ్యవసాయ విధానాన్ని అమలులోకి తీసుకురావడం ద్వారా రైతాంగానికి మేలు చేస్తామంటూ తమ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఈ బిల్లు ద్వారా అదే పని చేస్తున్న ప్రభుత్వాన్ని తప్పుబట్టడం పూర్తిగా నయవంచనే అని ఆయన ఎద్దేవా చేశారు.