శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:35 IST)

జగన్ ప్రభుత్వంలో రైతులకు ఒరిగింది శూన్యం: ఆలపాటి రాజేంద్రప్రసాద్

జగన్ ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యంచేస్తూ, రాష్ట్రరైతాంగాన్ని కోలుకోలేని విధంగా నాశనంచేస్తోందని, ఈ ప్రభుత్వం వచ్చాక రైతుల సంక్షేమానికి ఎన్నినిధులు వెచ్చించింది, ఎందరు రైతులను ఆదుకుందో తెలియచేస్తూ, పూర్తివివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని  టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.

శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతుసంక్షేమం మాటల్లోతప్ప చేతల్లో ఎక్కడా కనిపించడంలేదని చెప్పడంలో  ఎటువంటి సందేహం లేదన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రైతులకు అందించాల్సిన రుణమాఫీ సాయాన్ని అందించేలేకపోయిందన్నారు.

4, 5 విడతల రుణమాఫీ సొమ్ముని రైతుల ఖాతాల్లో జమచేసేలా నిధులను సిద్ధంగా ఉంచితే, ఈ ప్రభుత్వం వచ్చాక ఆసొమ్మును పక్కదారి  పట్టించిందన్నారు. దానికితోడు రైతులకు ఇంతవరకు రుణాలు అందలేదని, ఖరీఫ్ ప్రారంభమైనా రుణాలు అందించలేకపోవడం జగన్ ప్రభుత్వానికే  చెల్లిందన్నారు.

మరోవైపు పండిన పంటలను కొనేవారు లేకుండా పోయారని, 14 సొసైటీల్లో కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పినప్రభుత్వం, ఎన్నిలక్షల మెట్రిక్ టన్నుల పంటఉత్పత్తులు కొనుగోలు చేసిందో చెప్పాలని ఆలపాటి నిలదీశారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలే దళారులుగామారి, దోపిడికి పాల్పడ్డారన్నారు. ఒక్కరోజులో 3వేలమెట్రిక్ టన్నుల పంటఉత్పత్తులు కొన్నామని చెప్పడం పచ్చిఅబద్ధమన్నారు.

మార్కెట్ యార్డులకు తీసుకొచ్చి పంటలు విక్రయించిన రైతులకు ఇప్పటికీ బకాయిలు అందలేద న్నారు.  మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా రైతులను ఆదుకుంటామని, బడ్జెట్లో రూ.4వేలకోట్లు కొనుగోళ్లకు కేటాయించా మని చెప్పినపాలకులు రైతులను ఎలాఆదుకున్నారో చెప్పాలన్నారు.

రైతులకు నష్టం కలగకుండా రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నారని, అవన్నీ అధికారపార్టీ కేంద్రాలుగా మారాయితప్ప, రైతులకు న్యాయం చేయడం లేదన్నారు. పంటరుణాలు అందక, ఉత్పత్తులు కొనేవారు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కౌలురైతులను గుర్తించడంలో ఎలాంటి పద్ధతి అవలంభించారో, గుర్తించిన వారికి రంగుల భరోసా కేంద్రాల (ఆర్ బీ కే) ద్వారా ఏం న్యాయం చేశారో చెప్పాలన్నారు. 

రైతులకు యాంత్రీకరణ కింద అందించాల్సిన పరికరాలు అందడంలేదని, సేంద్రీయ వ్యవసాయా నికి మంగళం పాడారని మాజీమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూలిగేనక్కపై  తాటికాయ పడేసినట్లుగా తాజాగా వ్యవసాయ పంపసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించడంద్వారా రైతుల నడ్డి విరవడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. గతంలో ఈ విధానాన్ని రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాడని, మరిప్పుడు మీటర్లు బిగించడమే మంచిదని జగన్ ఎలా చెబుతాడన్నారు. 

సాంకేతిక పరిజ్ఞానం అమల్లో ఉంచుకొని, ఏరైతు ఎంతవిద్యుత్ వాడుతున్నాడో తెలుసుకోలేక పోవడం ఈ ప్రభుత్వ అసమర్థత కాదా అన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన జగన్, మరిప్పుడు దాన్ని లెక్కగట్టడం ఏమిటన్నారు? గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలవల్ల, రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా పోతే, ఈ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ లోటు ఎందుకొచ్చిందన్నారు?

విద్యుత్ వాడకాన్ని, నాణ్యతను అంచనావేయలేని ప్రభుత్వం ఎందుకన్నారు? ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు రైతులు ఎంతవాడినా దాన్ని పట్టించుకోకూడదని, ఎవరికో తొత్తులుగా మారిన పాలకులు, రైతులు వాడే విద్యుత్ కు మీటర్లు బిగించడానికి సిద్ధమవ్వడం సిగ్గుచేటన్నారు. విద్యుత్ మీటర్లు బిగించే నెపంతో మరో కొత్త దోపిడీకి పాల్పడటానికి సిద్ధమయ్యారన్నారు. ఏడాదిలోనే లక్షకోట్ల అప్పులుతెచ్చిన జగన్, ఆసొమ్ముని ఎవరికి పంచారో చెప్పాలన్నారు.

పింఛన్ దారులకు నెలకు రూ.2,250ఇస్తున్న ప్రభుత్వం, రైతుకు మాత్రం రూ.500లతో సరిపెట్టిందన్నారు. జగన్ రైతుసంక్షేమం మాటలకే పరిమితమైంది తప్ప, చేతల్లో రైతులకు ఒరిగింది శూన్యమన్నారు. ఇదివరకు కూడా రైతులకు సున్నావడ్డీకింద  రుణాలిస్తామని చెప్పి మోసగించారన్నారు. యాంత్రీకరణ, సేంద్రీయ వ్యవసాయం, పంటరుణాలు, పంట ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం తిలోదకాలివ్వబట్టే, రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు.

కల్లబొల్లిమాటలతో, మసిపూసిమారేడుకాయ చేస్తూ అన్నదాతను మోసగించడం ఎల్లకాలం సాగదని ఆలపాటి స్పష్టంచేశారు. రైతు వెన్నెముకను విరుస్తున్న ప్రభుత్వం రైతులచేతుల్లోనే నాశనమవుతుందని ఆలపాటి తీవ్రస్వరంతో హెచ్చరిచారు.