మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (08:50 IST)

వర్షానికి, వరదకు లోకేష్ తేడా తెలుసుకోవాలి: మంత్రి కురసాల కన్నబాబు

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు ఏమన్నారంటే?!...
 
రాష్ట్రంలో రిజర్వాయర్లు అన్నీ నిండి, నదులన్నీ పొంగి పొర్లుతూ, కావాల్సినంతగా వర్షాలు కురిసి రైతాంగం ఆనందంగా ఉన్న పరిస్థితులు ఇప్పటివరకూ చూశాం. అయితే, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో అధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైంది. గత ఐదు, ఆరు రోజులుగా గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరదల వల్ల పంట నష్టం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ లో ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని సమీక్షించారు. 

విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, నెల్లూరు.. మొత్తం 9 జిల్లాల్లో అధిక వర్షపాతం, వరద వల్ల పంట నష్టం జరిగింది. అక్టోబరు నెలలో పంట నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనాల ప్రకారం ఇప్పటివరకూ 1,7,797 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 13, 563 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వరి, అపరాలు, పత్తి, చిరు ధాన్యాలు, టుబాకో, కూరగాయలు, బొప్పాయి, తమలపాకు, పసుపు పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా వేశాం.

ప్రతి రైతుకు నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందించడానికి మానవతా దృక్పథంతో పనిచేయండని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాకు అధికారుల బృందాలు పర్యటిస్తున్నాయి. వరద పూర్తిగా తగ్గాక పంట నష్టం అంచనాలను పూర్తిగా తెలియజేస్తాం. మత్స్యకారులకు సంబంధించి 478 బోట్లు, 2974 హెక్టార్ల విస్తీర్ణంలో చేపల చెరువులు దెబ్బతిన్నాయి. 
 
ఈ అక్టోబరు నెలలో గోదావరి జిల్లాల్లో ఏలేరు వరదల వల్ల నష్టాలు కలుగుతున్నాయి. రిజర్వాయర్ కెపాసిటీ  24.1 టీఎంసీలు అయితే.. కిందకు 30 టీఎంసీలు వరద వదిలాం. దీంతో ఇరిగేషన్ డ్రైన్స్ అన్నీ తూర్పు గోదావరి జిల్లాలో పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా కాలనీలు ముంపు బారిన పడ్డాయి. పిఠాపురం, అనపర్తి, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో కొన్ని కాలనీలు ముంపులో ఉన్నాయి. ముంపుబారిన పడి నిరాశ్రయులైనవారికి రెండు పూటలా భోజన సదుపాయం, పడవలు ఏర్పాటు చేశాం. వాలంటీర్ల ద్వారా  మెడిసిన్ అందిస్తున్నాం. వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ఈ సమయంలో ముంపు బాధితులకు మంచి సేవలు అందిస్తున్నారు. 
 
- ముంపు ప్రాంతంలో ఇళ్ళు ఉండి, పూర్తిగా వారం రోజులుగా ఏ దారి లేని వారికి ఉచితంగా నిత్యావసర వస్తువులు అందిస్తున్నాం.  25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పామోయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు అందిచాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 

-ఏజెన్సీ ప్రాంతంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దారులు మూసిపోయాయి. రెవెన్యూ, ఐటీడీఏ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి, ప్రజలకు సేవలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశాం. ముంపు తగ్గాక, శానిటైజేషన్ సమస్యలు ఉత్పన్నమై.. అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అలానే ముంపు నివారణకు అవసరమైన శాశ్వత చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

-రేపటి నుంచి తుపాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. 
 
2019-20లో భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన ఇన్ పుట్ సబ్సిడీని పూర్తిగా మంజూరు చేయడం జరిగింది. ఇన్ పుట్ సబ్సిడీ జమ చేయడంలో, రైతుల అకౌంట్లకు సంబంధించి బ్యాంకుల్లో అక్కడక్కడా ఎదురవుతున్న ఆర్టీజీఎస్ సమస్యలను కూడా పరిష్కరించమని చెప్పాం.  భారీ వర్షాలు, వరదలు వచ్చినా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆయన కొడుకు లోకేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడాన్ని మేం తప్పు బట్టడం లేదు కానీ, అబద్ధాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ప్రయత్నం మంచి పద్ధతి కాదు. 
 
ఈ ప్రభుత్వం వచ్చాక రూ. 25 లక్షలు మాత్రమే ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చారని లోకేష్ మాట్లాడుతున్నది పచ్చి అబద్ధం. కనీస అవగాహన, జ్ఞానం లేకుండా లోకేష్ మాట్లాడుతున్నాడు. 2019 జులై, ఆగస్టులో వచ్చిన వర్షాలు, వరదలకు జరిగిన పంట నష్టానికి సంబంధించి రూ. 125 కోట్లు విడుదల చేశాం.  ఈ ఏడాది 54.55 కోట్ల రూపాయలు విడుదల చేశాం. రెండు రోజుల క్రితమే హార్టీకల్చర్ కు సంబంధించి రూ. 42 కోట్లు మంజూరు చేశాం. ఇవన్నీ తెలియకుండా, తెలుసుకోకుండా, ఎందుకు అబద్ధాలను వండి వడ్డిస్తున్నారు..?

- రైతు భరోసాతో పాటు,  వడ్డీ రాయితీ 1074 కోట్ల రూపాయలు జులై 8న రైతు దినోత్సవం నాడు ఇచ్చాం. చెరుకు రైతులకు   చంద్రబాబు పెట్టిన  రూ. 55 కోట్లు బకాయిలు ఇచ్చాం. చంద్రబాబు హయాంలో బకాయిలు పెట్టిన ఇన్ పుట్ సబ్సిడీలు ఇచ్చాం.  రైతులకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా ఇస్తుంటే.. వీళ్ళు ప్రజల ముందుకు వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు, పైగా సిగ్గు లేకుండా సవాళ్ళు చేస్తున్నారు. 

- తూర్పు గోదావరి జిల్లాలో 64 మంది రైతులు మరణించారని, ఈ ప్రభుత్వం వచ్చాక 750 మంది రైతులు మరణించారని కాకి లెక్కలు చెబుతున్నారు. మీకు ఈ లెక్కలు ఎవరు ఇస్తున్నారు..? ఎక్కడి నుంచి వస్తున్నాయి..? కనీస అవగాహన లేకుండా ఇలా అజ్ఞానంతో మాట్లాడితే మీరే నవ్వులు పాలవుతారు.  
 
చాలా అభ్యంతరకరమైన మాటలు లోకేష్ మాట్లాడుతున్నాడు. మీడియా అటెన్షన్ కోసం జగన్ మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడవద్దు.  ఫోటోలు తీయించుకోవడానికి మాత్రమే వచ్చినట్లు లోకేష్ పర్యటన ఉంది తప్పితే చిత్తశుద్ధి లేదు. ప్రజలకు, రైతులకు ఏ కష్టం వచ్చినా ప్రజల మధ్య ఉంటున్నది, ప్రజల కోసం సేవ చేస్తున్నది ముఖ్యమంత్రి వైయస్ జగన్, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాత్రమే. ప్రధాని చెప్పాకే అప్రమత్తం అయ్యాం.. అంటూ మాట్లాడుతున్న లోకేష్ మాటలు చూస్తుంటే.. ఇంకా నయం చంద్రబాబు చెబితే అప్రమత్తం అయ్యాం అనలేదు.

ఇటువంటి మాటలు ద్వారా లోకేష్ అజ్ఞానం బయటపడుతుంది. లోకేష్ కు ఉన్నదే చంద్రబాబు కుమారుడు హోదా. అంతకు మించి ఆయనకు హోదా ఉండటానికి ఆయనేమన్నా ప్రజల నుంచి ఎన్నికయ్యారా..? లేక ప్రజా పోరాటాలు చేసిన మహా నాయకుడా.. ? చంద్రబాబు కుమారుడు అనే హోదానే మేం గుర్తించాం. గుర్తించలేదని లోకేష్ ఎందుకు బాధపడుతున్నాడు.?
 
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తిడితేనో.. లేక అబద్ధాలు చెబితేనో మీడియాలో అటెన్షన్ వస్తుందన్నట్టుగా లోకేష్ మాటలు ఉన్నాయి. ఏలేరు ఆధునీకరణ చేయకపోవడం వల్ల పిఠాపురంలో ఇప్పుడు ముంపు వచ్చింది. అది మీ తండ్రి పాపమే. 
 
-రైతుల శాపం తగిలింది చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకే. రైతులకు  రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి.. రూ. 87 వేల కోట్లను, 24 వేల కోట్లు చేసి, చివరికి 15 వేల కోట్లు ఎగ్గొట్టి, 14 వేల కోట్లు ఇచ్చింది మీరు కాదా.. ? చంద్రబాబు స్కీములు, స్కాముల చరిత్ర తెలుసు కాబట్టే రైతులు టీడీపీని, చంద్రబాబును ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. పిల్లి శాపాలు తరహాలో ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ శాపాలేంటి.. ?
 
అమరావతి ప్రాంతంలోని కొద్దిమంది రైతుల సమస్య కోసం తప్ప..  రాష్ట్రంలో ఏ రైతు సమస్య కోసమైనా చంద్రబాబుగానీ, టీడీపీ నేతలుగానీ బయటకు వచ్చారా..? రైతులంటే, అమరావతిలో మీకు నచ్చిన రైతులేనా, రైతులంటే మీ చుట్టూ ఉండే రైతులేనా..?

-వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, చిన్న, సన్నకారు రైతులు.. మీ దృష్టిలో రైతులంటే బెంజి కార్లు ఉన్నవారే రైతులు..

- పోలవరం ప్రాజెక్టు 70 శాతం పూర్తిచేశాం అని మాట్లాడుతున్నారు.. ఇంకానయం పోలవరానికి శంఖుస్థాపన చేసింది వైయస్ గారు కాదు.. చంద్రబాబు అని లోకేష్ లాంటి అజ్ఞానులు చెప్పినా చెబుతారు వినేవాళ్ళు ఉంటే...

- అమరావతి రైతుల పట్ల మాకు సానుభూతి ఉంది. ఎందుకంటే, అమరావతి రైతులు చంద్రబాబు చేతిలో మోసపోయారు కాబట్టి. అక్కడి రైతులను ఇంకా భ్రమల్లోనే ఉంచి ఇప్పటికీ ముంచుతున్నది చంద్రబాబే. ఇప్పటికీ వాళ్ళను రాజకీయంగా వాడుకుంటున్నది చంద్రబాబే. మేం రైతులను కించపరచం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల మాకు బాధ్యత ఉంది. ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వంగా మా పని. ఆ పనే మేం చేస్తున్నాం. 
 
చంద్రబాబు మాదిరిగా బొమ్మలతో, గ్రాఫిక్స్ తో కాలక్షేపం చేసే సీఎం జగన్ కాదు. దేశం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ధైర్యం, దమ్ము ఉన్న ముఖ్యమంత్రిగా, మాట ఇస్తే.. నెరవేర్చే ముఖ్యమంత్రిగా జగన్ చేస్తున్న గొప్ప కార్యక్రమాలను చూసి దేశంలోని సీనియర్ ముఖ్యమంత్రులు, నేతలు సైతం జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

- నిన్ననే బీసీలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. చివరికి సంజార జాతులను సైతం గుర్తించి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ముఖ్యమంత్రి జగన్ పరపతి పెరిగిపోతుందని భయపడి.. అచ్చెన్నాయుడుని తెల్లారే సరికి టీడీపీ రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిని చేశారు. ఇదే ఏడాది ముందు ఎందుకు చేయలేదు. అచ్చెన్నాయుడు కార్మికుల సొమ్ము కొల్లగొట్టి స్కాంలకు పాల్పడ్డారు, ఆ కేసులు విచారణలో ఉన్నాయి.. ఆయన్ను ఇంకా పెద్ద పదవిలో కూర్చోబెట్టినా రాష్ట్ర ప్రజలు నమ్మరు. 
 
గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, విత్తనాలు, ఎరువులు, పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడం వరకు రైతులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతు భరోసా కేంద్రానికి లోకేష్ ను తీసుకువెళతా.. రండి.  చంద్రబాబుకు చేతగానిది ఈరోజు రైతు సంక్షేమానికి సంబంధించి సీఎం జగన్ ఏం చేయాలో అన్నీ చేసి చూపిస్తున్నారు. 
 
చిన్న పిల్లల ఆటల మాదిరిగా లోకేష్ మాట్లాడితే.. ఛాలెంజ్ లు విసిరితే ఆయనే నవ్వులుపాలవుతాడు. జనం మధ్యకు వస్తే నాలెడ్జితో రావాలి. వర్షానికి, వరదకు తేడా తెలుసుకోవాలి. వరదలు రాక ముందు చేసే దాన్ని డిజాస్టర్ మేనేజ్ మెంటు అంటారు. 
 
వరదలు, తుపానులు వచ్చాక  అక్కడ గొడుకు వేసుకుని చంద్రబాబులా కూర్చోవటం కాదు. 2019లో తెలుగుదేశం పార్టీకి జరిగిన నష్టానికి ముందు డిజాస్టర్ మేనేజ్ మెంటు చేసుకోండి. 

-ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం. నేను రైతు పక్షపాతిని అని ప్రకటించిన జగన్ ప్రభుత్వం ఇది. పేదలకు, రైతులకు సాయం చేసే విషయంలో జగన్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. 
 
-రిలీఫ్ క్యాంపుల్లో ఉండే వారికి పాలు, ఇతర, అత్యవసర చేతి ఖర్చుల కోసం రూ. 500 ఇస్తుంటే.. దాన్ని హేళన చేస్తారా.. ?
 
ఉల్లి ధరలు పెరుగుతున్నాయని గుర్తించి.. రైతు బజార్ల ద్వారా ఉల్లిని తక్కువ ధరకు సరఫరా చేసేందుకు, వెయ్యి టన్నుల ఉల్లిని మహారాష్ట్ర నుంచి తెప్పిస్తున్నాం. నాఫెడ్ ద్వారా తెప్పించి రైతు బజార్ల ద్వారా విక్రయించే కార్యక్రమాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభిస్తాం. నిత్యావసర సరుకుల ధరలను తగ్గించే కార్యక్రమాలను చేస్తున్నాం.