కరోనా ఎఫెక్ట్... తిరుమల కొండ నిర్మానుష్యం
తిరుమల కొండ శనివారం నిర్మానుష్యంగా తయారైంది. కరోనా వైరస్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న చర్యల్లో భాగంగా భక్తుల రాక పూర్తిగా నిలిచిపోయింది. వారం రోజుల పాటు స్వామివారి దర్శనాలను ఆపివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట అనంతరం బంగారువాకిలి వద్ద పరదా మూసివేసి, ఆలయ ఉద్యోగులు, టీటీడీ సిబ్బందికి కూడా సన్నిధి వద్దకు అనుమతి నిరాకరించారు.
జియ్యంగార్లు, ఏకాంగులు, అర్చకస్వాములు తదితర కైంకర్యపరులు మాత్రమే సన్నిధికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. తిరుమలలోని వివిధ మఠాలు కూడా స్వచ్ఛందంగా మూతపడ్డాయి. కరోనా కారణంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న ‘మనగుడి’ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుమలలో 'శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞం'
తిరుమలలో జరుగుతున్న శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞం శనివారం 6వ రోజుకు చేరుకుంది. శుక్రవారం నుండి ఈ జపయజ్ఞాన్ని శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో నిర్వహిస్తున్నారు. ప్రపంచ మానవాళికి అశాంతిని, ఆనారోగ్యాన్ని దూరం చేసి సర్వతోముఖాభివృద్ధిని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ జపయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు.
దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యం, పుష్టి, సుఖశాంతులు చేకూరుతాయని వేదపండితులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 30 మంది వేద పండితులు దీక్షగా వేదమంత్ర జపయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ ఇతర టిటిడి అధికారులు పాల్గొన్నారు.