సీఎం జగన్‌ను నమ్ముకంటే నట్టేట ముంచేశారే ... 'గుడ్డు' మంత్రి గుడివాడ అమర్నాథ్ నిర్వేదం...
ఏపీ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్‌కు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేరుకోలేని షాకిచ్చారు. సర్వేల పేరుతో ఆయన టిక్కెట్ ఇవ్వలేనని చెప్పకనే చెప్పేశారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆయన... కొత్త పల్లవి అందుకున్నారు. పార్టీ ఎలాంటి పదవి అప్పగించినా ఆ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దీనికి కారణం ఆయన ఎమ్మెల్యేగాను, మంత్రిగా ఒరగట్టిందిగానీ, ఉద్ధరించిందిగానీ ఏమీలేదు. మరి మంత్రిగా ఏం చేశారు.. కొత్త పరిశ్రమలు ఏం తెచ్చారు అంటే లేదీ. పైగా, 'ఇప్పుడేగా కోడి గుడ్డు పెట్టింది. పొదగాలి' అంటూ సెటైర్లు వేశారు. ఫలితంగా ఆయన గుర్డు మంత్రిగా చెరగని ముద్ర వేసుకున్నారు.
ఈ నేపథ్యంలో సొంత పార్టీ సర్వేల్లోనూ గెలిచే అవకాశాల్లేవని తేలడంతో అధిష్టానం వచ్చే ఎన్నికలకు అమాత్యుని సీటు గాల్లో పెట్టింది. ఇప్పటికే మంత్రి నియోజకవర్గం అనకాపల్లికి వైకాపా ఇన్ఛార్జిగా మలసాల భరత్‌ను నియమించింది. దాంతో ఆయన పక్క నియోజకవర్గాల్లోకి తొంగి చూసినా.. అక్కడా సామాజిక సమీకరణలు, సర్వేల్లో వెనుకబాటు ఉండటంతో మొండి చేయే చూపారు. వైకాపా ఏడు విడతలుగా ప్రకటించిన జాబితాలో మంత్రి అమరనాథ్‌కు చోటుదక్కలేదు. దీంతో సీటు రాదని అర్థమై, ప్రెస్మీట్‌లో మీడియా అడిగే ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక 'అధిష్ఠానం ఏ బాధ్యతలిచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నా' అంటూ కొత్త రాగం మొదలు పెట్టారు. సభలు, సమావేశాలకు హాజరైనా కక్కలేక మింగలేక నైరాశ్యంలో కనిపిస్తున్నారు.
నిజానికి విశాఖకు ఏ ప్రముఖులు వచ్చినా స్వాగతం పలికే బాధ్యత ఇప్పటివరకు అమర్నాథ్ చూసేవారు. తాజాగా విశాఖలో జరుగుతున్న మిలాన్‌కు ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్‌కర్ వస్తున్నారు. ఆయనకు ప్రభుత్వం తరపున స్వాగతం పలికే బాధ్యతల నుంచి మంత్రి అమర్నాథ్‌ను తప్పించి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు ప్రభుత్వం అప్పగించింది. దీనికీ కారణం లేకపోలేదు. ఇటీవల సచివాలయంలోని సీఎం సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ప్రభావమే అన్న చర్చ జరుగుతోంది.
ఉమ్మడి విశాఖలో ఏదొక నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం కల్పిస్తారనుకున్న అమర్‌నాథ్‌కు తాజాగా ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి అప్పగించారు. దాంతో ఇక సీటు వచ్చే అవకాశం లేదనే చర్చ సాగుతోంది. ఉమ్మడి విశాఖలోని 15 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి తనకు డిప్యూటీ ప్రాంతీయ సమన్వయకర్త పదవి ఇచ్చారని, 'నా తల రాత జగనే రాస్తారు' అంటూ చెప్పుకొస్తున్నారు. మరో వైపు ఆయన ఎమ్మెల్యే సీటు కోసం వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.