మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2017 (07:09 IST)

సమాజం కోసం 25 యేళ్లు శ్రమిస్తానంటున్న టాలీవుడ్ హీరో!

సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం 25 యేళ్ళ పాటు కష్టపడతానని టాలీవుడ్ స్టార్ హీరో అంటున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేనాధిపతి. ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాదులో పార్టీ కార్యక

సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం 25 యేళ్ళ పాటు కష్టపడతానని టాలీవుడ్ స్టార్ హీరో అంటున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేనాధిపతి. ఆయన శుక్రవారం రాత్రి హైదరాబాదులో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, 25 ఏళ్ల పాటు సమాజం కోసం, పార్టీ తరపున కష్టపడేందుకే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. 
 
తన లక్ష్యం కేవలం ఎన్నికల్లో సీట్లు గెలవడం మాత్రమే కాదన్నారు. ప్రజారాజ్యం పార్టీ విఫలమైన నేపథ్యంలో ప్రతి విషయంలో తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 2018 చివరి నాటికి తన బలాబలాలపై ఒక అంచనా వస్తుందన్నారు. తాను ఊహల్లో ఉండనని, వాస్తవంగా ఆలోచిస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనని తేల్చి చెప్పారు. 
 
విజయం సాధించని పక్షంలో పోటీ చేసి ఉపయోగం ఉంటుందా? అని ఆయన అడిగారు. అధికారం వస్తుందా? అసెంబ్లీకి వెళ్తామా? అన్నది ప్రశ్న కాదని, పని చేసుకుంటూ పోతే వచ్చేవి ఎలాగూ వస్తాయన్నారు. తాను ఒక ప్రాంతం, ఒక భాషకు పరిమితం కాదన్నారు. సోషల్ మీడియా ద్వారా పార్టీని విస్తరించాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. శతఘ్ని పేరుతో డిజిటల్ టీమ్‌ను ఆయన తయారు చేస్తున్నారు. 
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఇవ్వలేమని స్పష్టంగా చెప్పాలన్నారు. చెయ్యాలనుకున్నది చెప్పడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై విస్పష్ట ప్రకటన చేసేందుకు రాజకీయ పార్టీలకు ఉన్న అభ్యంతరం ఏంటని ఆయన నిలదీశారు. ప్రత్యేకహోదాపై ఉద్యమాన్ని ఎప్పుడూ ఆపలేదన్నారు. 
 
కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ కోసం సెమినార్ నిర్వహించాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. తాను చెప్పిన పనులు చేయాలని ప్రభుత్వంపై ఎన్నడూ ఒత్తిడి చేయలేదని చెప్పుకొచ్చారు. తనను పిలిస్తే ఎక్కడికైనా వెళ్తానన్నారు. తాను పేదల కోసం పని చేస్తున్నానని, తనకు ఏ పార్టీ పట్ల ప్రత్యేక అభిమానం లేదని, జనసేన నిర్మాణం ఇంకా జరుగుతోందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.