సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (12:27 IST)

ఏపీలో రోడ్ల రాజకీయం : మేం చేప్తేగానీ కళ్లు తెరవరా జగన్ రెడ్డి? పీకే ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల రాజకీయం తారా స్థాయికి చేరుకుంది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏపీలోని రోడ్లు దుస్థితిపై ఇటీవల స్పెషల్ ఫోటో షూట్ కార్యక్రమం చేపట్టారు. తద్వారా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు దుస్థితి బాహ్య ప్రపంచానికి తెలిసింది. దీంతో రోడ్ల దుస్థితిపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, రోడ్ల దుస్థితిపై జనసేన చెప్తేగానీ కళ్లు తెరవరా..? అని ప్రశ్నించారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని హితవు పలికారు. రాష్ట్రంలో రహదారులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో జనసేన నాయకులు, శ్రేణులు ఏకబిగిన సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తేనే వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరచి రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై ఆలోచన మొదలుపెట్టిందన్నారు. 
 
లక్షల మంది రహదారి కష్టాలను చెప్పారు. వర్షాలు తగ్గాక అక్టోబరు నెల తర్వాత రోడ్డు మరమ్మతుల ప్రక్రియ మొదలుపెడతామని వైసీపీ ప్రభుత్వం చెప్పిందని వెల్లడించారు. అప్పుడు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను నిర్ణయించి పనులు మొదలుపెట్టాలంటే సంక్రాంతి వస్తుందని, ఇక పనులెప్పుడు పూర్తవుతాయని పవన్ ప్రశ్నించారు.
 
'ప్రతి జనసేన నాయకుడు, జన సైనికుడు తమ పరిధిలోని రోడ్లకు సంబంధించిన అన్ని వివరాలను క్రోఢీకరించుకొని సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నాను. ఏ రోడ్డు ఎన్ని కిలోమీటర్ల మేర దెబ్బతిని ఉంది, మరమ్మతులతో బాగు చేయవచ్చా, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలా లాంటి వివరాలను సేకరించండి. ప్రభుత్వం చెప్పిన విధంగా అక్టోబరు తర్వాత మీ పరిధిలోని రోడ్డుకు మోక్షం కలుగుతుందో లేదో చూసేందుకు, అభివృద్ధి చేయాల్సిన రోడ్డును మరమ్మతులతో సరిపెట్టే పక్షంలో ప్రశ్నించేందుకు ఈ వివరాలు అవసరం. జనసేన నాయకులు, శ్రేణులు సిద్ధం చేసే ఈ వివరాలతో ప్రతి రోడ్డూ బాగుపడే వరకూ జనసేన పార్టీ గళమెత్తుతుంది' అని పవన్ వ్యాఖ్యానించారు.