శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 15 ఫిబ్రవరి 2018 (22:45 IST)

హిజ్రాలకు పింఛన్లు చెల్లించడానికి బడ్జెట్లో నిధులు... ఆర్థిక మంత్రి యనమల

అమరావతి : ప్రజల సంతృప్తి స్థాయి పెంచేవిధంగా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 2018-19 బడ్జెట్ ప్రతిపాదనలపై బీసీ, సాంఘిక, మహిళా, శిశు సంక్షేమ శాఖలతో పాటు రవాణా, ఆర్టీసీ, లేబర్ డిపార్టుమెంట

అమరావతి : ప్రజల సంతృప్తి స్థాయి పెంచేవిధంగా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 2018-19 బడ్జెట్ ప్రతిపాదనలపై బీసీ, సాంఘిక, మహిళా, శిశు సంక్షేమ శాఖలతో పాటు రవాణా, ఆర్టీసీ, లేబర్ డిపార్టుమెంట్ అధికారులతో సచివాలయంలోని తన కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యంగా మహిళా, శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాబోయే బడ్జెట్లో అన్న అమృతం పథకం అమలుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కోరారు. అన్న అమృతపథకం అమలు తీరుతెన్నులను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అడిగి తెలుసుకున్నారు. 
 
హిజ్రాలకు పెన్షన్లు చెల్లించడానికి బడ్జెట్లో నిధుల కేటాయించడానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నిర్ణయించారు. ఒకే ఇంట్లో ఇద్దరు వికలాంగులకు పెన్షన్లు ఇచ్చేవిధంగా బడ్జెట్ కేటాయింపునకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పసుపూ కుంకుమ కింద డ్వాకా మహిళలకు ఇప్పటివరకూ రూ.6 వేల రూపాయాలు అందజేశామని, ఉగాదికి రూ.2 వేల రూపాయలు ఇవ్వనున్నామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. మిగిలిన రూ.2 వేలు రాబోయే ఆర్థిక సంవత్సరంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు మంత్రి పరిటాల సునీత తెలిపారు. వచ్చే బడ్జెట్లో చంద్రన్న బీమా పథకం నిధులు కేటాయించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ కోరారు. ఇందుకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అంగీకరించారు. 
 
రాష్ట్రంలో 79 ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయని, వాటిలో 29 ఐటీఐలకు సొంత భవనాలతో పాటు యంత్ర సామాగ్రి సమకూర్చాలని మంత్రి పితాని సత్యనారాయణ కోరారు. దీనికి కూడా మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకరిస్తూ, ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగ భరోసా కల్పించాలని ఆదేశించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ, ఐటీఐ విద్యార్థులకు వచ్చే మే నెలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని తెలిపారు. మార్చి నుంచి రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. జనవరి నుంచి పంచదార అందజేస్తున్నామన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా, ప్రజాసంక్షేమం దృష్టిలో పెట్టుకుని పంచదార, కందిపప్పు అందజేస్తున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. 
 
స్టేట్ ఫుడ్ కమిషన్ నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయింపునకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకారం తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు కేటాయించాలన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరిక మేరకు మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకారం తెలిపారు. ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రి యనమల సూచించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ స్థలాలను లీజుకు ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 
 
రవాణా శాఖ నిర్ధేశించిన లక్ష్యం కంటే 26 శాతానికి పైగా ఆదాయం ఆర్జించడంపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ శాఖాధికారులను అభినందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు సేఫ్టీ ఫండ్‌కు నిధులు కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. రవాణా శాఖకు అవసరమైన యంత్ర సామాగ్రి సమకూర్చడానికి అవసరమైన నిధులు కేటాయింపునకు మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకరించారు. చంద్రన్న పెళ్లి కానుక, రెండో విడత ఆదరణ పథకం అమలు కోసం అవసరమైన నిధులు కేటాయించాలని, కాపు, బీసీ భవనాల నిర్మాణానికి అవసరమైన టెక్నికల్ విభాగం ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చేనేత భవనాలు నిర్మాణానికి నిధులు కేటాయింపునకు మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకరించారు. కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయింపుపైనా సమావేశంలో చర్చించారు. 
 
ఎస్సీ వెల్ఫేర్ కేటాయించిన నిధులను వంద శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఖర్చు చేయాలని సంబంధిత శాఖాధికారులకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. ఎస్సీలకు స్మశాన వాటికలు ఏర్పాటుకు రాబోయే బడ్జెట్‌లో నిధుల కేటాయింపునకు మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకారం తెలిపారు. ఎస్సీలకు ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలుకు గతంలో కంటే అధికంగా నిధులను వచ్చే బడ్జెట్‌లో కేటాయించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు కోరగా, అందుకు ఆర్థిక మంత్రి సరేనన్నారు. మెస్ ఛార్జీల కోసం అవసరమైన నిధుల కేటాయింపునకు సమావేశంలో నిర్ణయించారు. హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం చూపొద్దని, స్కాలర్‌షిప్పులు సకాలంలో అందజేయాలని సంబంధిత శాఖాధికారులకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశాల్లో డీజీపీ ఎం.మాలకొండయ్య, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రవిచంద్ర, ఇతర ముఖ్యకార్యదర్శులు సునీత, నీరభ్ కుమార్ ప్రసాద్, ఎస్.ఎస్.రావత్, రాజశేఖర్, సెర్ప్ సీఈవో కృష్ణమోహన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.