బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జనవరి 2025 (10:37 IST)

సీఐకు బెదిరింపులు - మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు

kakani
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైకాపా నేత కాకాణి గోవర్థన్ రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐను బెదిరించిన కేసులో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 27వ తేదీన పోలీసులు ఈ కేసు నమోదు చేయగా, ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణి ముఖ్య అనుచరుడు, వెంకటాచలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు మండల వెంకట శేషయ్య తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. 
 
దీనిపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాము అధికారంలోకి వస్తే సీఐ పచ్చ చొక్క ధరించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చుట్టూ తిరగాల్సి ఉంటుందంటూ బహిరంగ హెచ్చరికలు చేశారు. దీంతో పోలీసులను బెదిరించారని, కేసు విచారణ సక్రమంగా సాగకుండా నిర్వీర్యం చేయాలని చూశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది.