గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (09:10 IST)

నిత్యపెళ్లి కుమార్తె... ఆరుగురిని పెళ్లాడింది.. నాన్న - ప్రియుడితో కలిసి స్కెచ్

'మాకు కట్నం వద్దు... స్థోమతతో పనిలేదు. అమ్మాయి బాగుంటే చాలు' అంటూ ముందుకొచ్చే యువకులను లక్ష్యంగా చేసుకుని ఓ యువతి ఏకంగా ఆరుగురిని పెళ్లాడింది. ఈ వరుస పెళ్లిళ్ళకు ఆ యువతి తండ్రితో పాటు.. ప్రియుడు కలిసి పక్కా స్కెచ్‌తో అమలు చేసేవారు. కడప జిల్లా పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 
 
ప్రకాశం జిల్లా మొయిద్దీనాపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి అనే వ్యక్తి కుమార్తె మౌనికా రెడ్డి (20). ఈమెకు తొలుత కడప జిల్లా ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి (38)తో మూడు నెలల క్రితం వివాహమైంది. 
 
ఆ తర్వాత కుమార్తెను చూసేందుకు వచ్చిన తండ్రి.. తన కుమార్తెను కూడా తీసుకెళ్లాడు. పుట్టింటికెళ్లి కొద్దిరోజులు గడిపివస్తానని చెప్పి భర్తను నమ్మించింది. పోయే సమయంలో 30 వేల నగదుతో పాటు 8 తులాల బంగారాన్ని సర్దుకుని వెళ్లింది. భర్తకు టాటా చెప్పిన మౌనిక రెడ్డి తిరిగి రాలేదు. 
 
దీంతో మామకు ఫోన్‌ చేస్తే స్పందన లేకపోవడంతో కంగారుపడిన భర్త, ఈ నెల పదో తేదీన ఖాజీపేట పోలీసుస్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టాడు. తన భార్య ఎంతో మంచిదని, ఆమెను ఎవరో ఎత్తుకుపోయారని వాపోయాడు. దీనిపై ఖాజీపేట పోలీసులు అప్రమత్తమై, విచారణ చేపట్టారు. మౌనిక వివరాల కోసం ప్రకాశం జిల్లాకు వెళ్లి ఆరా తీయగా, నివ్వెరపరిచే విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. 
 
పోలీసుల విచారణలో మౌనికకు అప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయినట్టు తేలింది. ప్రతి సందర్భంలోనూ ఒక్కో భర్త వద్ద కొద్దిరోజులు ఉండి.. అక్కడ కొంతమొత్తం సొమ్ము, నగలు తీసుకుని చెక్కేస్తూ వచ్చేది. మౌనిక వరుస పెళ్లిళ్ళకు ఆమె తండ్రితో పాటు.. ప్రియుడు నాయక్‌లు తమ వంతు సహకారం అందించారు. ఇలా నలుగురు యువకులను ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లాడింది. 
 
ప్రతి సందర్భంలోనూ ఎవరికీ అనుమానం కలుగకుండా మెట్టినింట నడుచుకునేది. ఆ తర్వాత తండ్రి రావడం, పుట్టినింటికి బయలుదేరడం షరామామూలే. ఓ ఇద్దరిని మాత్రం విడాకులు ఇచ్చి వదిలించుకున్నట్టు సమాచారం. కానీ రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో మౌనిక రెడ్డి బండారం బయటపడింది. ఇటీవలే నాయక్‌ను ఆమె పెళ్లి చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్‌లో ప్రియుడిని, మైదుకూరులో మౌనిక, అనంతరెడ్డిని కడప పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.