ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్య పరిరక్షణ: సీపీఐ రామకృష్ణ
ఆర్ఎస్ఎస్ మతోన్మాద అజెండా అమలు కోసం ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తూ భారత లౌకిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ నిర్వాకంతో ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు వామపక్ష భక్తులు మరో స్వాతంత్ర్య ఉద్యమానికి సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం దాసరి నాగభూషణరావు భవన్ వద్ద విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని మతోన్మాదంతో నింపే ప్రయత్నం చేస్తుందని, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
అందువల్ల దేశ, స్వతంత్ర, రాజ్యాంగ విలువలు పరిరక్షణకై వామపక్ష శ్రేణులు ప్రతినబూని, ఉ ద్యమించాలని పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్ పార్టీ శ్రేణులతో “రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద విలువలు రక్షించుకోవడానికి, ప్రజలందరి సాంఘిక, రాజకీయ, సమానత్వాన్ని సాధించడానికి, భావ ప్రకటన, విశ్వాస, ఆరాధనలలో స్వేచ్ఛను కాపాడుకోవడానికి, దేశ సమైక్యతను స్వతంత్రాన్ని, ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని సంరక్షించుకోవడానికి అంకితమవుతున్నాం... అంటూ ప్రతిజ్ఞ చేయించారు,
కార్యక్రమంలో సీపీఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సహాయ కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు రాష్ట్ర సమితి సభ్యులు వై.చెంచయ్య, విజయవాడ నగర నాయకులు పల్లా సూర్యారావు, పంచదార్ల దుర్గాంబ, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రానాయక్, ఆర్.పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.