మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జులై 2020 (14:28 IST)

హైకోర్టులో పీవీపీకి ఊరట... విజయవాడలో ప్రత్యక్షమైన వైకాపా నేత

విజయవాడకు చెందిన వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. విల్లాను కొనుగోలు చేసిన వ్యాపారిపై దౌర్జన్యానికి పాల్పడిన కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తదుపరి విచారణ జూలై 27కు వాయిదా వేసింది. 
 
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లోని విల్లా గొడవలో పీవీపీపై కేసు నమోదైంది. దాదాపు 20 మంది రౌడీలను వెంటబెట్టుకుని వెళ్లి.. ఇంట్లో సామగ్రి ధ్వంసం చేసి, సదరు కొనుగోలుదారుణ్ని చంపేస్తానని బెదిరించారు. 
 
దీంతో బెదిరిపోయిన కొనుగోలుదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పీవీపీ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో పీవీపీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
 
ఇదిలావుండగా, హైకోర్టులో ఊరట లభించిన తర్వాత ఆయన విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. బెంజ్‌సర్కిల్ దగ్గర 108, 104 వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీవీపీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొద్దిసేపు సీఎం జగన్‌తో ముచ్చటించారు.