శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (06:00 IST)

జనవరి నుంచి రైతు భరోసా కేంద్రాలు

వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రారంభిస్తాయని మంత్రులు కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) తెలిపారు.

సచివాలయంలోని ఐదవ బ్లాక్ లోని సమావేశ మందిరంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్రస్థాయి అధికారులతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా వచ్చే ఏడాది ఏర్పాటయ్యే రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు కలిగే లాభాలు, దాని లక్షణాలు వంటి అంశాలపై వర్క్ షాప్ నిర్వహించారు.

సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ రంగంలో వినియోగించే ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాల ద్వారా సరసమైన ధరలకు విక్రయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు మంత్రులు తెలిపారు. రైతులకు సలహాలు, శిక్షణ ఇచ్చేలా ఈ కేంద్రాలను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

రైతులకు అందిస్తున్న వివిధ పథకాలను సక్రమంగా అందించడంలో ఈ కేంద్రాలు కీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ దిగుబడులు పెంపొందించి, రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ కేంద్రాలు పని చేయాలన్నారు. దశల వారీగా విత్తన పంపిణీ, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లుగా కూడా రైతు భరోసా కేంద్రాలు అవతరించాలని సీఎం పేర్కొన్నట్లు మంత్రులు అధికారులకు వివరించారు.

ఈ మేరకు ప్రస్తుతానికి ప్రతి జిల్లాలో 5 హబ్ లతో పాటు, ప్రతి మండలంలో 5 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతు భరోసా కేంద్రాలు ఎలా ఉండాలి, అందులో ఏయే వసతులు ఉంటే బాగుంటాయో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులను కోరారు.

అదే విధంగా రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయానికి సంబంధించి రైతుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు ఆర్డర్ ఇవ్వగానే ఎలా సరఫరా చేస్తే బాగుంటుందో సలహాలు ఇవ్వాల్సిందిగా అధికారులను కోరారు.  ఈ సందర్భంగా అధికారుల అభిప్రాయాలు తీసుకొని సంబంధిత అంశాలపై కూలంకషంగా చర్చించారు. రానున్న కాలంలో రైతు భరోసా కేంద్రాలు ఎలా పనిచేస్తాయో తెలిపారు.

ఈ సందర్భంగా వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్య,మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ మంత్రులు కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) మాట్లాడుతూ  వ్యవసాయం దాని అనుబంధ శాఖాధికారులు రైతుకు మేలు చేసే దిశగా పని చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలను అందించడంలో ఈ కేంద్రాలు కీలకం కానున్నాయని వెల్లడించారు.

పై స్థాయి నుండి క్షేత్రస్థాయి అధికారి వరకు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయశాఖతో పాటు  ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య, సెరికల్చర్, మార్కెటింగ్ శాఖల అధికారులు అనుక్షణం సమన్వయం చేసుకుంటూ రైతు కోసం విధిగా కష్టపడాలన్నారు. రైతు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు.

ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సంబంధిత అధికారులు రైతుల పొలాల వద్ద ఉండాలన్నారు. అదే విధంగా మధ్యాహ్నం రైతు భరోసా కేంద్రాల్లో కూర్చొని రైతులకు సలహాలు, సూచనలు అందించాలన్నారు. రైతు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇటీవల నియమితులైన విలేజ్ సెక్రటేరియట్ కు సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకునే అంశంపై అధికారులకు సూచనలు చేశారు.

గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్, వెటర్నరీ ఉద్యోగులు రైతు భరోసా కేంద్రాల నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ సి ఎస్ పూనం మాలకొండయ్య, ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్,

మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ మధుసూధన్ రెడ్డి తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన వ్యవసాయ శాఖతో పాటు  ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య, సెరికల్చర్, మార్కెటింగ్ శాఖలకు సంబంధించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఆత్మ), కమిషనర్లు, డైరెక్టర్స్, అడిషనల్ డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్ డిప్యూటీ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇతర అధికారులు పాల్గొన్నారు.