మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2019 (20:31 IST)

జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లో చేర్చుకోవటానికి, దానికి సంబంధించిన బిల్లును శాసనసభలో రవాణా, సమాచారర-పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఏపీ రోడ్డు రవాణా సంస్థలోని ఉద్యోగులను అందరినీ ప్రభుత్వంలో విలీనం చేయటానికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజారవాణా 
శాఖ అనే కొత్త శాఖను రవాణా శాఖ ద్వారా ఏర్పాటు చేయటానికి ఈ చట్టం ఉపయుక్తమవుతుందని అన్నారు.

2004 తర్వాత ఆర్టీసీ ప్రైవేటు పరం అవుతుందన్న తరుణంలో నాడు వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి 
అయి నాడు ఆర్టీసీ జవం-జీవం పోశారు. మళ్లీ 2019లో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి పాదయాత్రలో ఆర్టీసీలో నష్టాలు, కనీసం జీతాలు సక్రమంగా 1వ తేదీకి వస్తాయన్న సంగతి అటు ఉంచి కనీసం 
ఆర్టీసీ అనేది ప్రజల ఆస్తిగా బ్రతికి ఉండే అవకాశాలు కూడా ఉండటం లేదన్నారు.

తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అనేక గ్రామాల్లో అనేక మంది వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి చెప్పారు. ఆరోజే గ్రామాల్లో, నడిరోడ్డు మీద సమస్యల విని.. అదే నడిరోడ్డు మీద పరిష్కారం చెబుతూ..మనందరి ప్రభుత్వం వస్తే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో చెప్పటమే కాకుండా మేనిఫెస్టోలోనూ పొందుపరిచారని మంత్రి పేర్ని నాని తెలిపారు.

ప్రతి ప్రచార సభలోనూ ఆర్టీసీ ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయటానికి ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగిందని పేర్ని నాని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయటానికి ఓ  చట్టం చేయటానికి ఆవశ్యకత ఎందుకు వచ్చిందో పేర్ని నాని వివరించారు.

1997లో చంద్రబాబు 141997 అనే చట్టాన్ని తెచ్చారు. ప్రభుత్వ అనుబంధ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులను ఎవ్వరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా చేయకుండా అడ్డుకోవటానికి ఈ చట్టాన్ని తెచ్చారని వివరించారు.  ప్రభుత్వం ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగస్తులకు మేలు చేయటానికి, వెసులుబాటు కోసం చట్టాలు చేస్తాం.

గత ఆరునెలలుగా ప్రతి చట్టం ప్రజాహితం కోసం చేసిన చట్టాలు. నాడు ఉద్యోగస్తులకు భయంకరమైన కలగా 141997ను చంద్రబాబు తయారు చేశారని మంత్రి పేర్నినాని మండిపడ్డారు. దాన్ని అధిగమించటానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయటానికి ఈ చట్టం తీసుకురావటం జరిగిందని పేర్ని నాని వివరించారు.  
 
పాలకుడు ఎవరైనా హృదయంతో స్పందించేవారు అవసరమన్నారు. మెదడుతో ఆలోచిస్తే కష్టమన్నారు. ఇందుకు ఆర్టీసీ విలీనమే పెద్ద ఉదాహరణగా పేర్ని నాని తెలిపారు. సెప్టెంబర్‌ 22, 2017న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆర్టీసీలోని కార్మిక సంఘం ఓ కార్యక్రమానికి పిలిచి వరాలు అడిగారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆ సభలో ఏం మాట్లాడారో వీడియో ప్లే చేశారు.

''రాబోయే రోజుల్లో గవర్నమెంట్‌ డిపార్టమెంట్‌లో పనిచేసే వారికే ఉద్యోగాలు. మీ పనితనం బట్టి ఉద్యోగాలు. ఎక్కడ వ్యవస్థ ఉన్నా బాగుండాలి. ఈరోజు మీరంతా పబ్లిక్‌ సెక్టార్‌ అంతా గవర్నమెంట్‌కు వస్తే నష్టాలు వస్తాయి. ఎక్కడికక్కడ మీరు బాగా కష్టపడండి'' అని చంద్రబాబు ఆ వీడియోలో అన్నారు. ప్రభుత్వంలో కలపండని ఉద్యోగులు స్లోగన్స్‌ ఇచ్చారు. ఫెర్ఫార్మెన్స్‌ బట్టి ఉద్యోగాలు అని చంద్రబాబు అన్నారు. అలాంటి పబ్లిక్‌ రంగ సంస్థల నుంచి ఇలా చేయటం సాధ్యంకాదని చంద్రబాబు అన్నారు.
 
మరోవైపు.. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారిని ఆర్టీసీలో పనిచేస్తున్న 65వేల మంది కార్మికులు అడిగారు. ఆరోజు వైయస్‌ జగన్‌ గారు మాటిచ్చారు. ఆర్టీసీలో పనిచేస్తున్న 65వేల మందిని గవర్నమెంట్‌లో విలీనం 
చేస్తానని ఆనాడు వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి స్పందించారని వీడియో ప్లే చేసి మంత్రి పేర్నినాని చూపించారు.

హృదయం ఉన్నవాడు పాలకుడు అయితే ఏవిధంగా ప్రజలకు మేలు జరుగుతాయో ఈ ఆరు నెలల్లో కొకొల్లులుగా 
కనిపిస్తున్నాయని దీనికి మనం అంతా సాక్ష్యులుంగా మిగిలామని మంత్రి పేర్ని నాని అన్నారు. చెప్పిన మాట కోసం సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎలా నిలబడతారో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిని పరిణామ క్రమాన్ని మంత్రి పేర్ని నాని వివరించారు. 
 
- మే 30, 2019న వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
- జూన్‌ 8, 2019న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 
- జూన్‌ 14, 2019న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఏర్పాటు చేస్తూ ఆంజనేయరెడ్డి కమిటీ ఏర్పాటు చేశారు. 
గతంలో ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఆ హామీలను మొదటి సంతకాలుగా రుణ కమిటీ కోసం కోటయ్య కమిటీ వేసి చంద్రబాబు సాగదీశారు. అలాగే కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని కేబినెట్‌ సబ్‌ కమిటీ 
వేశారు. ఆ కమిటీ ఈరోజు వరకు రిపోర్ట్‌ ఇవ్వలేదు. కాలం అయిపోయిందని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. 
 
కానీ, సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణీత కాలపరిమితి (టైంబౌండ్‌) పెట్టి ఆంజనేయరెడ్డి గారి కమిటీ రిపోర్ట్‌ ఇవ్వాలని చెబితే సెప్టెంబర్‌ 03న రిపోర్ట్‌ ఇచ్చారు. సెప్టెంబర్‌ 04న మంత్రివర్గ సమావేశంలో ఆ రిపోర్ట్‌ పెట్టి ఆర్టీసీ 
ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా నిర్ణయం తీసుకోవటం జరిగింది.

ఎవరు అడగకుండానే సెప్టెంబరు మాసంలో నుంచి ఆర్టీసీ పని చేస్తున్న ఉద్యోగస్తులు (58 ఏళ్ల నుంచి ) 60 ఏళ్లకు రిటైర్డ్‌ అవుతారని సీఎం నిర్ణయం తీసుకున్నారని సభలో మంత్రి పేర్నినాని తెలిపారు. అక్టోబర్‌ 11, 2019న ఉద్యోగుల విలీన ప్రక్రియ విధివిధానాల కోసం ఐఏఎస్‌, కార్యదర్శులతో కమిటీ వేయటం జరిగిందన్నారు. నవంబర్ 01, 2019న ఆర్టీసీ బోర్డు ఆమోదించటం జరిగిందని మంత్రి వివరించారు.

ఈ సందర్భంగా చాలా మందికి అనుమానాలు వచ్చాయి. ఆర్టీసీ వీళ్ల జాగీరా? 61% రాష్ట్ర వాటా అయితే, 39% కేంద్రానిది కదా అని కొందరు ప్రశ్నించారని అయితే, కేంద్రానికి సంబంధించి బోర్డు సభ్యులు కూడా ఈ విలీనాన్ని ఆమోదించారని మంత్రి తెలిపారు. డిసెంబర్‌ 04, 2019న వేసిన కార్యదర్శుల కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించటం జరిగిందన్నారు.

విలీన ప్రక్రియ కోసం కొత్త చట్టం రూపొందించాలి అని తెలిపారు. ఎందుకు అంటే 1997లో చంద్రబాబు చట్టం తయారు చేశారని దీనికోసం కేబినెట్‌లో కొత్త చట్టం చేసి ఆమోదం చేయటం జరిగిందన్నారు.  డిసెంబర్‌ 16, 2019న ఆర్టీసీ ఉద్యోగస్తులను పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లోకి విలీనం చేస్తూ చట్టం తెచ్చామని మంత్రి పేర్ని నాని పరిణామక్రమాన్ని వివరించారు.

మే 30న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పిన మాటను నిలబెట్టుకోవటానికి కేవలం 200 రోజుల్లో చేసి 
చూపించారన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ వ్యక్తులను నోరు మూయిస్తూ ఆర్టీసీ ఉద్యోగస్తులను విలీనం చేయటానికి నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. భారతదేశ చరిత్రలో ఇలాంటిది జరిగి ఉండదు. భవిష్యత్‌లో జరగదని 
నాని తెలిపారు. ఈరోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు అమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు.

ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న కార్పొరేషన్‌ ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మార్చటం 
రాష్ట్రంలోనే జరిగిందన్నారు. ఇవాళ ఉదయం రివర్స్‌ అంటూ ప్రతిపక్షం వెనుకడుగులు వేసింది. ఇప్పటికైనా వెనకడుగులు మానేసి మనస్సులో అయినా చప్పట్లు కొట్టాలని కోరుతున్నానని పేర్ని నాని అన్నారు. 
 
2014లో రాష్ట్రం విడిపోయింది. ఆనాడు ఆర్టీసీ అప్పులు రూ.2904 కోట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం పెరుగుతూ 2015లో రూ.3435.98 కోట్లు, 2016లో రూ.4171.47 కోట్లు, 2017లో రూ.4496.96 కోట్లు, 2018లో 
రూ.5652.99 కోట్లు, 2019 మార్చి 31 నాటికి రూ.6816.67 కోట్లు ఆర్టీసీ అప్పులు ఎగబాకాయి. ఆర్టీసీ బాగు చేయాలని దక్షత గల ముఖ్యమంత్రి ఉంటే.. నష్టాలు ఎగబాకితే 40 ఏళ్లు అనుభవం ఉన్న పాలన చూశాం.

నేడు 
ఆరు మాసాల పాలన చూస్తున్నామన్నారు. ఆర్టీసీ చరిత్రలో రూ.1572 కోట్లు ఒక ఏడాదిలో ఇచ్చిన ముఖ్యమంత్రి ఒక్క వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే అని మంత్రి పేర్ని నాని తెలిపారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి కంటే వందల 
అడుగులు ముందుకు వేసి ఆర్టీసీని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బ్రతికించారని మంత్రి తెలిపారు. రాజకీయంగా పనులు చేయటానికి కాగితాల మీద సంతకాలు పెడతారని అనుకుంటారు.

3600 కోట్ల ఆర్థిక భారాన్ని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం భుజాలకు ఎత్తుకొంటోంది. గడిచిన పాలనకు, వైయస్‌ జగన్ పాలనకు వ్యత్యాసం పోల్చుకుంటే.. 2013లో పే రివిజన్‌ కమీషన్‌ ఇచ్చిన జీతభత్యాల పెంపుదలే సాక్ష్యం అన్నారు. 2014లో 40 ఏళ్ల అనుభవం ఉన్న పాలకుడు పెంచిన జీతాలు 5 ఏళ్లలో తీర్చలేదు. బాకీ పెట్టిన 45% జీతాలు ఈ ఆరు మాసాల్లో తీర్చారని మంత్రి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న బకాయిలు తీర్చటం జరిగిందన్నారు. అలా రూ.60 కోట్లు సీసీఎస్‌కు చెల్లింపులు చేశామన్నారు.

ప్రతిరోజు అధికారులు, మంత్రులకు ఒక్కటే సీఎం గారు చెప్పారు. జనవరి 1 నాటికి ప్రజారవాణా శాఖలోకి ఉద్యోగులుగా మారాలన్నది లక్ష్యంగా సీఎం గారు నిర్ణయించారని మంత్రి తెలిపారు. ఈరోజు సీఎం గారు ఇచ్చిన మాట నెరవేరుతోందని పేర్ని నాని తెలిపారు. ఈ సందర్భంగా ఇంత చిత్తశుద్ధితో పెద్ద బాధ్యతను ఏ రకంగా నిర్వర్తించారో మీరంతా చూశారు కాబట్టి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారిని అభినందిస్తూ బిల్లును ఆమోదించటానికి సభ్యులు సహకరించమని మంత్రి పేర్ని నాని కోరారు.