ఆర్టీసీ ఉద్యోగులకు ఇక పండుగే

apsrtc
ఎం| Last Updated: గురువారం, 5 సెప్టెంబరు 2019 (08:43 IST)
ప్రభుత్వంలో ఏపీఎస్‌ ఆర్టీసీ విలీనానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 52,813 మంది ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం కానుంది. బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ ఆర్టీసీ ఉద్యోగులను రీ డిజిగ్నేట్‌ చేయాలన్న మాజీ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి కమిటీ సిఫార్సులను ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

దీంతో ఇకపై ఆర్టీసీలోని ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరంతా కొత్తగా ఏర్పాటయ్యే ప్రజా రవాణా శాఖ కిందకు వస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు, నియమ నిబంధనలు ప్రజా రవాణా శాఖలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి.

ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని రవాణా, ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన శాఖలను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. కొనసాగనున్న సర్వీస్‌ రూల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ నేతృత్వంలో ప్రజా రవాణా శాఖ పని చేయనుంది. ఆర్టీసీకి వీసీ అండ్‌ ఎండీ ఎక్స్‌ అఫీషియోగా కొనసాగుతారు.

ఆర్టీసీలో ఈడీలు అడిషనల్‌ డైరెక్టర్లుగా, రీజనల్‌ మేనేజర్లు జాయింట్‌ డైరెక్టర్లుగా, డివిజనల్‌ మేనేజర్లు డిప్యూటీ డైరెక్టర్లుగా, డిపో మేనేజర్లు అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా రీ డిజిగ్నేట్‌ కానున్నారు. ప్రజా రవాణా శాఖ ఏర్పాటయ్యాక ఓ తీర్మానం చేస్తారు. ఆర్టీసీ ఆస్తులను, సంస్థను ప్రజా రవాణా శాఖకు బదిలీ చేస్తూ ఈ తీర్మానం ఉంటుంది.

ఈ శాఖలో సర్వీస్‌ రూల్స్, రెగ్యులేషన్స్‌ అన్నీ కొనసాగుతాయి. ప్రస్తుతం ఉన్న ఇంటెన్సివ్‌లు, పే స్కేళ్లలో ఎలాంటి నష్టం లేకుండా కొనసాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతారు.

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీఆర్‌ఎస్‌ ఆప్షన్‌ వర్తిస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులు తమ పీఎఫ్‌ ఖాతాలను పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌)లో ఉంచాలా? లేక నోషన్‌ పెన్షన్‌ స్కీంలో ఉంచాలా? అనేది వారి ఇష్టానికి వదిలేస్తారు.
దీనిపై మరింత చదవండి :