సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (18:06 IST)

అత్తి వరద స్వామి.. నేపథ్యం గురించి తెలుసా? (Video)

తమిళనాడు  రాష్ట్రంలో అడుగడుగునా ఆలయాలే దర్శనమిస్తాయి. ఇక కాంచీపరం సంగతికొస్తే.. అది ఆలయాల నగరంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ సుమారు 1000కి పైగా ఆలయాలు ఉన్నాయి. దక్షిణాపథంలోని ఏకైక మోక్షపురి కంచి. కంచిలో సుప్రసిద్ధ ఆలయాల్లో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి. 108 దివ్య తిరుపతులలో ఒకటైన వైష్ణవ క్షేత్రంగా ఇది విరాజిల్లుతుంది. 
 
ఈ ఆలయంలోనే బంగారు, వెండి బల్లులు ఉంటాయి. పురాణాల ప్రకారం.. ఒకసారి సరస్వతి ఆగ్రహానికి గురైన బ్రహ్మదేవుడు తన శక్తులను కోల్పోయాడు. వీటిని తిరిగి పొందడానికి కాంచీపురంలోని అత్తి అడవుల్లో అశ్వమేథయాగం నిర్వహిస్తున్నాడు. బ్రహ్మ యాగాన్ని భగ్నం చేయడానికి అసురులు, రాక్షసులతో కలిసి సరస్వతి వేగావతి నదిని ఆ ప్రాంతం గుండా పారించింది. ఈ సమయంలో శ్రీమహావిష్ణువు అత్తివరదర్‌ అగ్ని రూపంలో దర్శనమివ్వగా సరస్వతి శాంతించింది. దీంతో బ్రహ్మదేవుడి యాగం నిరాటంకంగా సాగింది.
 
బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడంతో దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ అత్తి చెట్టు కాండంతో శ్రీవరదరాజ స్వామి విగ్రహాన్ని తయారుచేసి ప్రతిష్ఠించారు. అనేక వందల ఏళ్లు ఈ స్వామి పూజలందుకున్నారు.


అయితే, 16వ శతాబ్దంలో మహ్మదీయులు దండయాత్రల సమయంలో శ్రీవరదరాజస్వామి ఆలయం దోపిడీకి గురైంది. అయితే, సంపదలను దోచుకున్న శ్రీవారి మూర్తికి ఎలాంటి హాని కలగరాదనే ఉద్దేశంతో అక్కడ ఆనంద పుష్కరిణిలో నీరాళి మండపం పక్కన చిన్న మండపం అడుగు భాగంలో స్వామివారి విగ్రహాన్ని భద్రపరిచారు.
 
లోపలికి నీళ్లు చేరకుండా వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున దాచిపెట్టారు. అయితే, పుష్కరిణిలో దాచిపెట్టిన విగ్రహం గురించి ఆనవాళ్లు తెలియకపోవడంతో పరిస్థితి సర్దుకున్నాక గర్భాలయంలో వేరొక దివ్య మూర్తిని ప్రతిష్ఠించారు. కొన్నేళ్లకు పుష్కరిణి ఎండిపోవడంతో అందులో దాచిపెట్టిన మూలమూర్తి దర్శనమిచ్చారు. అన్నేళ్లు నీటిలో ఉన్న చెక్కుచెదరని ఆ విగ్రహాన్ని బయటకు తీసి తాత్కాలికంగా ప్రతిష్ఠించారు. 
 
48 రోజుల పాటు పూజలు నిర్వహించి, తిరిగి కోనేరు అడుగు భాగానికి పంపించేశారు. అలా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపరిన శ్రీ అత్తి వరదరాజ స్వామిని 40 ఏళ్లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి, 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979లో దర్శనం ఇచ్చిన శ్రీఅత్తి వరదరాజ స్వామిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత 2019 జులై 1 నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇది ఆగస్టు 17 వరకు కొనసాగుతుంది. 
 
తొమ్మిది అడుగుల పొడవైన స్వామివారి విగ్రహం మొదటి 38 రోజులు శయన స్థితిలోనూ, చివరి పది రోజులు నిలబడి వున్నట్లుగా అత్తి వరదరాజ స్వామి దర్శనమిస్తాడు. ఈ స్వామికి 48 రోజుల్లో రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలు సహస్రనామార్చన జరుగుతుంది.

అత్తి చెట్టు కలపతో పూర్వకాలంలో తొమ్మిది అడుగుల దేవుడి విగ్రహాన్ని చెక్కి, దాన్నే గర్భగుడిలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. దీనిని బ్రహ్మదేవుడి ఆదేశాలతో విశ్వకర్మ చెక్కినట్టు పురాణాలు చెబుతున్నాయి.