Karthika Soma Pradosam: కార్తీక సోమవారం ప్రదోషం.. ఇలా చేస్తే అన్నీ శుభాలే
కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేస్తే శివుడి అనుగ్రహం పొందుతారని కార్తీకపురాణం చెబుతోంది. కార్తీకమాసంలో తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్మకం.
ఈరోజున సాయంత్రం ప్రదోష సమయంలో ఇంటిలోని పూజగదిలో దీపారాధన చేసుకుని నక్షత్ర దర్శనం తర్వాత శివాలయనికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి.
కార్తీక సోమవారం రోజున ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తారు. ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు ఆచరించిన పుణ్య ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు. అలాగే కార్తీక సోమవారం వచ్చే ప్రదోష రోజున శివునికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం చేయించాలి.
ప్రతి నెలా రెండుసార్లు ప్రదోషం వస్తుంది. ఈ తిథిని త్రయోదశి అని కూడా పిలుస్తారు. ప్రదోష సమయం ఎల్లప్పుడూ సూర్యాస్తమయానికి ఒక గంట ముందు నుండి సూర్యాస్తమయానికి ఒక గంట తర్వాత వరకు ఉంటుంది.
ఈ సమయంలో, శివుడు, పార్వతి దేవిలకు పూజ చేయడ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక ప్రదోష రోజున శివునిని పూజించడం ద్వారా 15 రోజులు ఆలయానికి వెళ్లడం, 11 ప్రదోషాలను శివుడిని పూజించడం, కుంభాభిషేకం చూడటం వంటి పుణ్య ఫలితాలను ఇస్తుంది. ఇలా 120 ప్రదోషాలను పూజించే వారికి పునర్జన్మ ఉండదు.
ఈ జీవితంలో మన సామర్థ్యాన్ని పరిమితం చేసే కర్మ లేదా కర్మ శక్తులను తొలగించడానికి ప్రదోష సేవ ఒక అవకాశం. ఈ రోజున శివుడిని పూజిస్తే శని దోషాలు తొలగిపోతాయి. ప్రదోషం రోజున అదీ కార్తీక సోమవారం వచ్చే ప్రదోషం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం, పూజలు చేసేవారికి సంపద, పిల్లలు, ఆనందం, గౌరవం లభిస్తాయని శివ పురాణం పేర్కొంది. ప్రదోష శుభ సమయంలో శివుడిని ప్రార్థించే వారు పాపాల నుండి విముక్తి పొందుతారని చెబుతారు.
అలాగే కార్తీక సోమవారం నాడు వచ్చే ప్రదోషాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ పూజతో చంద్ర దోషాలు వుండవు. చంద్రుడు మీ మనస్సును నియంత్రిస్తాడు. మీ భావోద్వేగాలను నియంత్రిస్తాడు. అందుకే చాలా మంది తమ ఆందోళన, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి చంద్రుడిని సోమవారం, పౌర్ణమి రోజున పూజిస్తారు.
చంద్రునికి అధిపతి శక్తిదేవి. ప్రదోష పూజలో నందీశ్వరునికి చాలా ప్రాముఖ్యత వుంది. ఈ రోజు నందీశ్వరునికి అభిషేకం చేయించి.. ఆ తంతును కనులారా వీక్షించే వారికి సకల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కార్తీక సోమవారం వచ్చే ప్రదోషం రోజున శివ పూజ కర్మలను తొలగిస్తుంది. మోక్షాన్ని ప్రసాదిస్తుంది.