క్షీరాబ్ది ద్వాదశి తులసి-దామోదర కళ్యాణం
క్షీరాబ్ది ద్వాదశి నాడు చేయవలసిన అత్యంత ముఖ్యమైన ఆచారం దామోదరుడు లేదా సాలగ్రామం, తులసి దేవి వివాహాన్ని నిర్వహించడం. దీనినే బృందావన ద్వాదశి అని కూడా అంటారు. ఆరోజు సాయంకాలం లేదా శుభ ముహూర్తంలో తులసి మొక్కను శుభ్రం చేసి, ముగ్గులతో అలంకరించాలి. తులసిని పెండ్లికూతురుగా భావించి చీర, నగలతో అలంకరిస్తారు. తులసి పక్కన శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని లేదా పటాన్ని లేదా ఒక ఉసిరిక కొమ్మను ఉంచి, బ్రహ్మ ముడితో.. అంటే పసుపు దారంతో వారికి కళ్యాణం జరిపిస్తారు.
ఇలా తులసి లక్ష్మీ స్వరూపం, విష్ణువును వివాహం చేయడం వలన ఆ ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, సౌభాగ్యం లభిస్తాయని విశ్వసిస్తారు. కార్తీక మాసంలో దీపారాధన ప్రధానం, క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపారాధన మరింత విశిష్టం. తులసి కోట చుట్టూ దీపాలను వెలిగించడం అత్యంత శుభప్రదం. శివాలయం లేదా విష్ణు ఆలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆలయాల్లోని ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెట్టడం వలన గొప్ప పుణ్యం లభిస్తుంది.
ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం తులసి కల్యాణం అయ్యేవరకు ఉపవాసం ఉంటారు. స్వామి క్షీరసాగరం నుండి వచ్చిన రోజు కాబట్టి, పాలు లేదా పాల పదార్థాలను భుజించడం లేదా వాటిని దానం చేయడం శ్రేయస్కరం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం వలన సమస్త పాపాలు తొలగి, జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.