1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (12:18 IST)

రాజమండ్రి 3వ పట్టణ పోలీసులకు కరోనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఈ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్ఐలతో పాటు.. 9 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. అలాగే, ఈ స్టేషన్‌లోని మిగిలినవారికి కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
అలాగే, కర్నూలు జిల్లాలో ఉన్న వైద్య కాలేజీలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఈ కాలేజీలోని అనేక మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ఇప్పటివరకు 50 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 15 మందికి ఈ పాజిటివ్ ఫలితం వచ్చింది.
 
ఇందులో 11 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం చదువుతుంటే, నలుగురు హౌస్ సర్జన్ విద్యార్థులు. అలాగే, మరో 40 మంది విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించి పరిశోధనాశాలకు పంపించారు. వైద్య కాలేజీలో చదువుకునే విద్యార్థులకు ఈ వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్‌గా వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
కరోనా కోరల్లో ఖాకీలు 
దేశ రాజధాని ఢిల్లీపై కరోనా పంజా విసిరింది. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వైరస్ దెబ్బకు హస్తినవాసులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. ఒక్క ఆదివారమే ఏకంగా 300 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, పార్లమెంట్‌లో పని చేసే సిబ్బందిలో దాదాపు 400 మంది వరకు ఈ వైరస్ సోకింది. 
 
ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని విభాగాలకు చెందిన పోలీసులకు ఈ వైరస్ సోకింది. వీరంతా గత కొంతకాలంగా కోవిడ్ ఆంక్షలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇలాంటి వారిలో అనేక మందికి ఈ వైరస్ సోకింది. దీంతో మిగిలిన పోలీసులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. 
 
ఇదిలావుంటే ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 23.53 శాతంగా ఉంది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,49,730గా చేరుకుంది. ఇందులో 60733 యాక్టివ్ కేసులు అందుబాటులో ఉన్నాయి. అలాగే, మరో 1463837 మంది ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు.