ఇఫ్లూ: విద్యార్థినిపై సహ విద్యార్థులే అత్యాచారం!
ఇఫ్లూ విద్యార్థినిపై సహ విద్యార్థులే అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు విద్యార్థులు తోటి విద్యార్థినిపై అత్యాచారం చేశారు. నాలుగు నెలల క్రితం ఇదే వర్సిటీ క్యాంపస్లో ఓ విద్యార్థి తన సహ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించిన సంఘటన మరువక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తోంది.
24 గంటల తర్వాత ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లు మండలంలోని మంగలపల్లిలో శనివారం రాత్రి ఆరేళ్ల చిన్నారి పైన అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రఫీక్ ఇంటిని ఆదివారం గ్రామస్థులు కూల్చేసి నిప్పంటించారు.
గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆమనగల్లు పట్టణానికి వెళ్లి శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారి పైన గంటన్నరపాటు ధర్నా చేశారు. పోలీసులు వచ్చి నిందితుడి పైన నిర్భయ కేసును నమోదు చేసినట్లు తెలిపారు.