బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:47 IST)

ఆక్రమణల తొలగింపులో సిఫారసులు చెల్లవు: మంగళగిరి ఎమ్మెల్యే

మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు విస్తరణకు ఆక్రమణల తొలగింపులో ఏ విధమైన సిఫారసులు చెల్లవని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి స్వష్టం చేశారు.నిర్దాక్షిణంగా డ్రెయిన్ టు డ్రెయిన్ గౌతమ బుద్ధ రోడ్డును విస్తరిస్తామని పేర్కొన్నారు.

మరి కొద్ది రోజుల్లో మంగళగిరి పట్టణంలోని ప్రధాన రహదారి అయిన గౌతమ బుద్ధ రోడ్డు విస్తరణ పనుల్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఆక్రమణల తొలగింపుకు అనుసరించాల్సిన విధానాలపై మంగళవారం ఉదయం పురపాలక సంఘ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే ఆర్కే సమావేశమయ్యారు.శాఖల వారీగా అధికారులను సూచనలు,సలహాలు అడిగి తెలుసుకున్నారు.
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ,ఎన్నారై వైద్య శాల నుండి రైల్ వె ఓవర్ బ్రిడ్జ్ వరకూ సుమారు 4 కిలోమీటర్ల మేర 122 అడుగుల వెడల్పుతో 8.8 కోట్ల అంచనా వ్యయం తో  గౌతమ బుద్ధ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయని,ఆర్ అండ్ బి ఆధీనంలో ఉన్న ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ శాఖ చేజిక్కించుకుందని  అన్నారు.

రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ పోల్స్ ను తొలగింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేసినందుకు ఆ శాఖ అధికారులను అభినందిస్తున్నట్లు చెప్పారు.రోడ్డుకు ఇరు వైపులా 36 చోట్ల ఆక్రమణలను గుర్తించిన అధికారులు సదరు ఆక్రమణదారులకు  నోటీసులు ఇచ్చారని తెలిపారు.ఆక్రమణల తొలగింపులో సిఫారసులు ఏ మాత్రం చెల్లవని,తొలుత సౌమ్యంగా చెప్పినా వినక పోతే న్యాయ బద్దంగా వెళతామని తేల్చి చెప్పారు.

జాతీయ స్వర్గీయ నేతల విగ్రహాల తొలగింపు విషయంలో ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కరిస్తామన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా 172  చెట్లు నిర్వీర్యం అవుతున్నట్లు గుర్తించామని విస్తరణ అనంతరం ఒక్కో చెట్టుకు బదులుగా 10 చొప్పున మొక్కలు పెంచుతామని తెలిపారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ హేమమాలినీరెడ్డి,తహసీల్ధార్ రామ్ ప్రసాద్,డీఎస్పీ దుర్గా ప్రసాద్,ఆర్ అండ్ బి డీఈ,లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన ఈఓ మండేపూడి పానకాలరావు,ఎలక్ట్రికల్ ఈఈ విజయ్ కుమార్,అటవీ శాఖ అధికారి రామ్మోహనరావు, పట్టణ ఎస్సై నారాయణ,మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటేశ్వరరావు,డీఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
మోడల్ మంగళగిరికి త్వరలో టెండర్లు
శాసన రాజధానిగా ఆవిర్భవించినందున మంగళగిరి అభివృద్ధి ప్రాధాన్యతను సంతరించుకుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.మంగళగిరి తాడేపల్లి పురపాలక సంఘాలను మోడల్ పట్టణాలుగా తీర్చి దిద్దెందుకు ప్రభుత్వం రూ.1,200 కోట్లు మంజూరు చేసిందని త్వరలో అభివృద్ధి పనులకు టెండర్లు పిలవనున్నారని చెప్పారు.

రెండు మున్సిపాలిటీల అభివృద్ధి పై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి  దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు.రెండు పట్టణాలు కలిపి కార్పొరేషన్ గా అవతరించనున్నాయని,ఇందులో భాగంగా డాన్ బాస్కో పాఠశాల నుండి ప్రకాశం బ్యారేజి వరకూ రోడ్డును విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.