బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (08:28 IST)

నకిలీ చిట్ ఫండ్ కంపెనీల పట్ల కఠినం: సిఎస్

నకిలీ చిట్ ఫండ్ కంపెనీలు, మోసపూరిత ఆర్థిక సంస్థలు ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించక మోసాలకు పాల్పడే సంస్థల పట్ల సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులేటరీ సంస్థలు, ఏజెన్సీలు నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారు.

అమరావతి సచివాలయంలో 18వ రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ చిట్ ఫండ్ కంపెనీలు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట వివిధ మోసపూరిత ఆర్థిక సంస్థలను నిర్వహించుట ద్వారా ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి మోసాలకు పాల్పడే సంస్థల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని అలాంటి సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు పూర్తి సమన్వయంతో పనిచేసి ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగితే వెంటనే రిజర్వు బ్యాంకు దృష్టికి తీసుకురావడంతో పాటు సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ స్పష్టం చేశారు.
 
అంతకుముందు గత 17వ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ సమావేశంలో చర్చించిన అంశాల మినిట్స్ ను తెలుసుకోవడంతో పాటు ఆ సమావేశంలో సమీక్షించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికపై చర్చించారు.
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల రిజర్వు బ్యాంకు రీజనల్ డెరెక్టర్ సుబ్రతా దాస్ మాట్లాడుతూ అనధికారిక ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వు బ్యాంకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ప్రజలను మోసగించే ఆర్థిక సంస్థలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
 
అంతకు ముందు ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో అగ్రిగోల్డ్, అభయగోల్డ్, అక్షయ గోల్ట్, హీరా గ్రూప్, కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు, ఫూచర్ మేకర్ లైఫ్ కేర్ ప్రవేట్ లిమిటెడ్, అవని మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ తదితర చిట్ ఫండ్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు ఏజన్సీలపై నమోదైన కేసుల ప్రగతిని సిఎస్ నీలం సాహ్ని సమీక్షించారు.
 
ఈ సమావేశంలో ఆర్థిక,హోం శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్.ఎస్.రావత్, కిషోర్ కుమార్, రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ సిద్ధార్ధ జైన్, సహకార శాఖ కమిషనర్ వాణీ మోహన్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి డా.కె.సత్యనారాయణ, సిఐడి అదనపు డిజి సునీల్ కుమార్,

రిజర్వు బ్యాంకు జనరల్ మేనేజర్లు సారా రాజేంద్ర కుమార్, వై.జయకుమార్, ఎస్ఎల్ బిసి కన్వీనర్ మరియు ఆంధ్రాబ్యాంకు జనరల్ మేనేజర్ నాంచారయ్య, రిజర్వు బ్యాంకు ఎజియంలు, ఇతర విభాగాలు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.