1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 4 నవంబరు 2014 (12:26 IST)

నెల్లూరులో రొట్టెల పండుగ కోలాహలం... భారీగా తరలి వస్తున్న భక్తులు

ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు నగరంలో రొట్టెల పండుగ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని చెరువు వద్ద ఉన్న బారా షహీద్ దర్గా పెద్ద మసీదులో రొట్టెల పండుగ జరుగుతోంది. రొట్టెల పండుగకు భక్తజనం భారీగా తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పండుగ ఏడో తేది వరకు జరుగుతుంది. 
 
పీర్ల పండుగ పర్వ దినాల్లో ముస్లింలు, హిందూవులు కలిసి రొట్టెల పండుగను జరుపుకోవడం ప్రత్యేకత. భక్తులు దర్గా వద్ద కోరికలు కోరుతూ.. నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ భక్తులు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే రొట్టెలను భక్తులు తలపై వేసుకుని చెరువులో మునిగిన తర్వాత రొట్టెలను మార్పిడి చేసుకుంటారు. 

ఈ పండుగకు రాష్ట్ర వ్యాప్తంగానే కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రొట్టెల పండుగ సందర్భంగా దర్గా వద్ద గంధ మహోత్సవం జరుగుతుంది. ఈ పండగలో అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.