శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (19:35 IST)

దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌కు రుషికొండ బీచ్ ఎంపిక‌: మంత్రి ముత్తంశెట్టి

ప్రపంచ పరిశుభ్ర బీచ్‌ల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి రుషికొండ బీచ్ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు  హర్షం వ్యక్తం చేశారు. సోమవారం రుషికొండ బీచ్ నుండి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వీడియో కాన్పరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు.

డిల్లీ నుండి వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రకాష్ జవదేకర్   దేశంలో ఎంపిక కాబడిన 8 బీచ్‌లలో బ్లూ ఫ్లాగ్ పతాకావిష్కరణను ప్రారంభించారు. ఏపి నుండి ఎంపిక కాబడిన విశాఖపట్నం జిల్లాలోని రుషికొండ బీచ్‌లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బ్లూ ఫ్లాగ్ పతాకావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌కు రాష్ట్రం నుండి రుషికొండ బీచ్ ఎంపికైందన్నారు.

పర్యావరణ విద్య, సమాచారం, స్నానం చేసే నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, పరిరక్షణ, బీచ్‌లలో భద్రత, సేవలు లాంటి 33 ప్రమాణాలను పరిశీలించి ఎంపిక చేస్తారని తెలిపారు.

రాష్ట్రంలోని 9 బీచ్‌లు విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బలు, గుంటూరులోని సూర్యలంక, తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, చింతలమోరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలెం, ముల్లపర్రు, కృష్ణాజిల్లాలోని మంగినపూడి, ప్రకాశంలోని రామాపురం, నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్‌లను కూడా అభివృద్ది చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని కోరారు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వల్ల అంతర్జాతీయ పర్యాటకులు వస్తారని తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్దికి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని తెలిపారు. నూతన పర్యాటక పాలసీని కూడా  ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.12 ప్రాంతాలలో 5 లేదా 7 నక్షత్రాల హోటళ్ల‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆథారిటి సిఇఓ ప్రవీణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్, జిల్లా పర్యాటక శాఖ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.