శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 15 జనవరి 2022 (16:30 IST)

సచివాలయ ఉద్యోగులకు షాక్... అందరికీ జీతాల్లో కోత!

ఏపీలోని వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చింది. ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేయాలంటూ ఇటీవల వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలో ఏకంగా 10665 సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. విధులకు హాజరు కాకుండా నిరసనలో పాల్గొన్నందుకు ఒక రోజు జీతంలో జగన్‌ సర్కార్‌ కోత పెట్టింది.
 
 
సచివాలయ ఉద్యోగులందరికీ జీత భత్యాలు మినహంచాలంటూ డీడీఓలను మండల స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకు విరుద్దంగా వ్యవహరించి జీత భత్యాలు విడుదల చేస్తే డీడీఓలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. శాంతియుతంగా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తే జీత భత్యాలు కోత విధించడం ఏంటంటూ.. సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
 
ఉద్యోగంలో చేరి రెండేళ్లు పూర్తయినా ప్రొబేషన్‌ డిక్లేర్‌, పే స్కేల్‌ అమలు చేయలేదని… గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఇలా ఆందోళ‌న చేసినందుకు ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. కొంద‌రు త‌మ స‌చివాల‌యం యాప్ నుంచి వైదొల‌గ‌డంతో ప్ర‌భుత్వాధికారులు కంగుతిన్నారు. స‌చివాల‌య సిబ్బంది స‌మ్మె నేపథ్యంలో జగన్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, త‌మ జీతాలు క‌ట్ చేయ‌డం ఏంట‌ని, త‌మ‌కు వ‌చ్చేదే త‌క్కువని స‌చివాల‌య ఉద్యోగులు బోరుమంటున్నారు.