శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 10 జనవరి 2022 (13:13 IST)

ప్రొబేషన్ కోసం స‌చివాల‌య ఉద్యోగుల నిర‌స‌న‌, జూన్ లో చేస్తాన‌న్న‌ సీఎం!

గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు త‌మ ప్రొబేషన్ ప్ర‌క‌టించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేస్తున్నారు. దీనితో గ్రామ,వార్డు సచివాలయ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జ‌రుపుతోంది. త‌మ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. ఆ ఉద్యోగ సంఘాల‌తో కార్యదర్శి అజయ్ జైన్ చర్చలు జ‌రుపుతున్నారు.
 
 
జూన్ నుంచి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని సీఎం జ‌గ‌న్ హామీ ఇచ్చారు. కానీ, స‌చివాల‌యంలో విధుల్లో చేరి రెండేళ్లు పూర్తయిన వారికి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా జి.కొండూరులో సచివాలయ ఉద్యోగుల శాంతియుత నిరసన తెలిపారు. జి.కొండూరులో 140 మంది  మండల సచివాలయ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్, కొత్త పే స్కేల్ గురించి 76 గంటల పాటు పెన్డౌన్ చేయాల‌ని నిర్ణ‌యించారు. దీనితో జి.కొండూరు మండలంతోపాటు రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో సేవ‌లు నిలిచిపోయాయి. సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 
 
 
తమను ఉద్యోగాలలో నియమించి 2021 అక్టోబర్ నాటికి రెండు సంవత్సరాలు పూర్తి అయినా పే స్కేల్ ఇవ్వలేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. తమ విన్నపాలు పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇందులో చాలా మంది స‌చివాల‌యం యాప్ ల  నుంచి వైదొల‌గ‌డంతో త‌మ ఆదేశాల్ని ఎలా అందించాలో తెలియ‌క ఉన్న‌తాధికారులు తిక‌మ‌క ప‌డుతున్నారు. మ‌రో ప‌క్క గ్రామాల్లో ప్ర‌జ‌లు కూడా స‌చివాల‌య సేవ‌లు ఎలా అందుకోవాలో తెలియ‌క అయోమ‌యంలో ఉన్నారు.