ప్రత్యేక ప్యాకేజీ పిండాకూడులా ఉంది.. అలా చేయడం చిప్ప చేతికివ్వడమే: శివాజీ
ప్రత్యేక హోదాపై కేంద్రం అనుసరిస్తున్న విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇప్పటిదాకా ప్యాకేజీ ఇస్తున్నట్లు ఎలాంటి సమాచారం అందలేదంటూ వ్యాఖ్యానించారు. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వడం లేదని కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాపై ఇప్పటివరకూ వేరే ఆలోచన కానీ, రాజీ కానీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే కేంద్రం ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీపై సినీ నటుడు శివాజీ మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే స్పెషల్ ప్యాకేజీ పిండాకూడులా ఉందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగితే.. బ్యాంకు లోన్లిస్తామనడం చిప్ప చేతికివ్వడమే అని శివాజీ విరుచుకుపడ్డారు. విశాఖ రైల్వే జోన్‌తో లాభాలు వస్తాయనుకుంటే కేంద్రం పప్పులో కాలేసినట్టే అవుతుందన్నారు. విజయవాడలో జోన్ ఏర్పాటు చేస్తే గొడవలు ఉత్పన్నమవుతాయన్నారు. రాజధానికిచ్చే రూ.2,500 కోట్లు రోడ్లకు కూడా సరిపోవని వెల్లడించారు.
ఇదిలా ఉంటే కేంద్రం మాత్రం ప్యాకేజీ విషయంలో స్పష్టమైన అవగాహనతో ముందుకెళుతోంది. హోదా ప్రయోజలనాలన్నీ కేంద్రం ప్యాకేజిగా తయారుచేసింది. ఈ ప్యాకేజిపై కేంద్రం వారం రోజులుగా కసరత్తు చేసింది. ఇవాళ ప్యాకేజికి సంబంధించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించనున్నారు. హోదా వల్ల కేంద్ర పథకాల నిధుల్లో 90శాతం గ్రాంట్లు ఉంటాయని తెలుస్తోంది.