తిరుపతిలో మార్చి 4న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
తిరుపతిలో మార్చి 4వ తేదీన జరుగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్న ఎజెండా అంశాలపై అధికారులతో సీఎం వైయస్ జగన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించనున్న అంశాలను ఈ సందర్బంగా సీఎంకు అధికారులు నివేదించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షతన జరిగే ఈ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరిల నుంచి ముఖ్యమంత్రులు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌ల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారని అధికారులు సీఎంకు వివరించారు. ప్రధానంగా 26 అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరుగుతాయని తెలిపారు.
ఈ సమావేశంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఫైనాన్స్ సెక్రటరీ నటరాజన్ గుల్జార్, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ స్పెషల్ సెక్రటరీ మధుసూధన్ రెడ్డి, ఇరిగేషన్ సెక్రటరీ శ్యామల రావు, దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.