తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం గణపతి హోమంతో విశేషపూజహోమ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.
పవిత్రమైన కపిలతీర్థంలోని శ్రీకపిలేశ్వరస్వామివారి క్షేత్రంలో స్వయంభువుగా వెలసిన స్వామివారి సన్నిధిలో హోమాల్లో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమని అర్చకులు వెల్లడించారు. కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ హోమ మహోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఉదయం పంచమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూదితో విశేషంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం గణపతిపూజ, పుణ్యహవచనం, వాస్తుపూజ, పర్యగ్నికరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ, గణపతి హోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించనున్నారు. నవంబరు 6, 7వ తేదీల్లోనూ గణపతి హోమం జరుగనుంది.
కాగా, నవంబరు 8 నుండి 10వ తేదీ వరకు శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం, నవంబరు 10న శ్రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. నవంబరు 11న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, నవంబరు 12న శ్రీ నవగ్రహ హోమం, నవంబరు 13 నుంచి 21వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం), నవంబరు 22 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం(రుద్రయాగం), డిసెంబరు 2న శ్రీ శివపార్వతుల కల్యాణం చేపడతారు. డిసెంబరు 3న శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, డిసెంబరు 4న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల ఆరాధన నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ధ్యానారామంలో నెల రోజుల పాటు రుద్రాభిషేకాలు.
కార్తీక మాసం సందర్భంగా అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహాశివుడికి రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నమకం, చమకం, మహాహరతి జరిగాయి. కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుండి 6.45 గంటల వరకు జరిగే రుద్రాభిషేకాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.