ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (20:54 IST)

రేషన్‌ బియ్యం బదులు తృణదాన్యాలు సరఫరా చేయాలి

ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా సరఫరా అవుతున్న రేషన్‌ బియ్యం బదులు తృణదాన్యాలు (రాగులు, జొన్నలు) ప్రభుత్వ ఆదేశాలు (సీసీఎస్‌ ఆర్‌ఇఎఫ్‌ నెం. ఎన్‌/91/2018 తేది : 26`8`2018) మేరకు పంపిణీ చేయాలని వినియోగదారుల వ్యవహరాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ జిల్లా విజిలెన్స్‌ కమిటీ సభ్యులు, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు ప్రజా పంపిణీ వ్యవస్ధ, వినియోగదారుల వ్యవహారాల సమస్యలకు సంబంధించిన 20 అంశాలపై జాయింట్‌ కలక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డికు వినతిపత్రాన్ని ఆయన అందజేశారు. ఆ వివరాలను శనివారం ప్రసార మాధ్యమాలకు వెంకటరమణ విడుదల చేశారు.

ఆహార భద్రత చట్టం అమలు, ఫిర్యాదుల స్వీకరణ, సమస్యల పరిష్కారం, పర్యవేక్షించడానికి నియమితులైన అధికారుల పేర్లు, హోదాలు, చిరునామాలు, ఫోన్‌ నెంబర్లు, ఈ`మెయిల్‌ వివరాలు కల్గిన బోర్డులు ప్రజలకు కనిపించేలా జిల్లా, ఏఎస్‌వో, సర్కిలాఫీసులు, రేషన్‌ డిపో, తహశీల్ధార్‌, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయాలన్నారు.

ఏపీ లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్ధ (నియంత్రణ) ఉత్తర్వు`2018 నిబంధన 26 (బి), ఆహార భద్రత చట్టం`2013లను అనుసరించి నాలుగేళ్లుగా నియామకానికి నోచుకోని మండల, రేషన్‌ డిపో స్ధాయి విజిలెన్స్‌ కమిటీలను తక్షణం నియమించాలని కోరారు.

ధరల దరువు నేపధ్యంలో నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం షాపుల వద్ద నిత్యావసర సరుకుల ధరలు, సరుకుల నిల్వల బోర్డును ప్రదర్శించాలన్నారు. అనకాపల్లి, నర్సీపట్నంలలో రైతు బజార్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల పంపిణీ చేస్తున్న పంచదార తడి, చెమ్మగా ఉంటోందని, నాణ్యత లేదని దీనిని సరిచేయాలన్నారు.

రూ. కోట్ల విలువైన పనికి ఆహార పథకం బియ్యం, కిరోసిన్‌ చాలా మంది డీలర్లు వద్ద ఏళ్ల తరబడి ఉందని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనికి ఆహార పథకం బియ్యం, కిరోసిన్‌ నిరుపయోగంగా ఉందన్నారు. దీనిపై బాధ్యత ఎవరు వహిస్తారని ఆయన ప్రశ్నించారు.

మేరా రేషన్‌ యాప్‌కు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ ఆఫీస్‌ మోమోరాండం (ఎఫ్‌.నెం. జె`25/59/2021`సీసీపీఏ తేది : 1`1`2021), వినియోగదారుల రక్షణ చట్టం (ఈ కామర్స్‌) రూల్స్‌ 2020 ప్రకారం ఈ కామర్స్‌ ప్లాట్‌ ఫారాలు (వేదికలు) అమలు చేయాల్సిన నిబంధనలుపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని కాండ్రేగుల వెంకటరమణ జెసీకు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని జెసీ హామీ ఇచ్చారన్నారు.