టీడీపీ మాజీ ఎంపీ కుమారుడి ఆత్మహత్యాయత్నం!
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనయిర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గత రాత్రి రాంజీ నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగావుంది.
ఈ తెల్లవారుజామున రాంజీని చూసిన కుటుంబీకులు, అతన్ని హుటాహుటిన విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నామని వైద్య వర్గాలు వెల్లడించాయి.
రాంజీ పరిస్థితి విషమంగా ఉందని, కొన్ని గంటలు గడిస్తేనే అతని స్థితిపై ఓ అవగాహన వస్తుందని డాక్టర్లు అంటున్నారు. రాంజీ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరింత సమాచారం తెలియాల్సి వుంది.
కాగా, గతంలో రాంజీపై పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. వరసకు వదిన అయ్యే మహిళకు అసభ్యకరమైన మెసేజ్‌లను పంపించాడన్న కేసు విషయంలో విచారణ కొనసాగుతోంది. తనకు జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవి కావాలని కూడా రాంజీ గతంలో రోడ్డెక్కారన్న సంగతి తెలిసిందే.