శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (12:52 IST)

చంద్రబాబు బెయిల్ - కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా .. సుప్రీంలో కూడా రేపే...

chandrababu
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ బుధవారానికి వాయిదాపడింది. రెండు పిటిషన్లపై విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జి వెల్లడించారు. 
 
బెయిల్ పిటిషన్లపై మంగళవారం వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు. ఈ రోజే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని అభిప్రాయపడ్డారు. పైగా, రేపటి నుంచి తాను సెలవుపై వెళుతున్నట్టు ఆయన తెలిపారు. 
 
అందువల్ల బుధవారం రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని జడ్జి సూచించారు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి మంగళవారం సెలవు పెట్టడంతో ఇన్‌చార్జ్ జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి న్యాయాధికారిగా వ్యవహరించారు. 
 
మరోవైపు, తనపై అక్రమంగా బనాయించిన తప్పుడు కేసును కొట్టి వేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే విచారణను మాత్రం బుధవారానికి వాయిదావేసింది. అయితే, ఈ పిటిషన్ ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందే సాయంత్రానికి వెల్లడికానుంది. 
 
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెల్సిందే.