విజయవాడ ఆటోనగర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగంను, వ్యవస్థలను కాపాడతామని ప్రమాణం చేసి కక్షతో ఆ రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్టులో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని, వ్యయం పెరుగుతుందని కేంద్ర జలశక్తి మంత్రి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా, హైకోర్టు నిర్ణయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుంది, వైఎస్ హయాంలో పోలవరం పనులు రద్దు వలన 4 సంవత్సరాల ఆలస్యం, రూ.2500 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుమతి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆదేశాలతో జరుగుతున్న పనులను వేగవంతం చేయడానికి నవయుగ సంస్థకు అప్పగించారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వారి సౌలభ్యం కోసం పోలవరం ప్రాజెక్టు పనులను ఆపివేశారన్నారు, పనుల నిలిపివేతతో 27 వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి.
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈఎన్‌సీ వెంకటేశ్వరరావుని తప్పించారు, నలుగురు ముఖ్యమంత్రులు దగ్గర పనిచేసిన అందరికీ నచ్చిన ఈఎన్‌సీని మీకు ఎందుకు చెడ్డగా కనిపిస్తున్నారని, ఆయన పోలవరం ప్రాజెక్టులో 70 శాతం పనులను చేసినందుకు మీకు బాధగా ఉందా? అని ప్రశ్నించారు, పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,548 కోట్లకు అనుమతి సాధించడంలో ఈఎన్‌సీ విజయం సాధించారన్నారు.
ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ, బెకమ్, నవయుగ సంస్థలు పోలవరం ప్రాజెక్టులో పనిచేసి 70 శాతం పూర్తి అయిన తర్వాత జరుగుతున్న పనులు ఆపి కోర్టుధిక్కారం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ తాబేదార్లకు పోలవరం ప్రాజెక్టును కట్టబెట్టడానికి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లారని, కాంట్రాక్టులను మార్చుకుంటూపోతే పోలవరం ప్రాజెక్టు భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పోలవరం విషయంలో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు.. పోలవరం ప్రాజెక్టు సంబంధించిన 48 గేట్లకు సంబంధించిన పనులు జర్మనీలో జరుగుతున్నాయని, దేశ విదేశాల్లో నిపుణుల సమక్షంలో పనులు జరుగుతున్న సమయంలో రివర్స్‌కు వెళ్లడం సరికాదన్నారు.
మీ మూర్ఖత్వపు, తొందరపాటు నిర్ణయాలతో రాష్ట్ర ప్రగతి కుంటుపడిందని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, రాష్ట్ర ప్రజలకు మీరు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం మీద బురదజల్లేందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా చెప్పాలని, గత 5 సంవత్సరాలలో 55 వేల కోట్ల ఇరిగేషన్ పనులు జరిగాయని, నీటి సంరక్షణలో మనకు దేశంలో రెండవ స్థానం వస్తే ఒక్కమాట అయిన చెప్పారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు లో పునాదులు లేవని జగన్మోహన్‌రెడ్డి గారు వారి పాదయాత్రలో ప్రజలకు ప్రచారం చేశారని, మొన్న లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాపర్ డ్యామ్ చెక్కు చెదరలేదని.. పాదాయత్రలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాబోయే 1000 రోజులలో ఈ రద్దుల జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని తనే రద్దుచేసుకున్నా ఆశ్చర్యం లేదన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వంద రోజుల పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసం, రివర్స్, రద్దులో కొనసాగిందని, ఒక అసమర్థుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైందని, ఇసుక విధానం ప్రకటించడానికి ఈ ప్రభుత్వంకు మూడు నెలల కాలం పట్టింది, దళారులకు దోచిపెట్టేలా ఇసుకపాలసీ విధానం ఉందని, మద్యం పాలసీలోమద్యం కంపెనీలతో ఈ ప్రభుత్వం లాలూచీపడి వారి కార్యక్రమాలు చేస్తున్నారు.
గతంలో తమిళనాడులో కూడా ఇదే మాదిరిగా చేసి అవినీతికి పాల్పడ్డారని, 100 రోజుల పరిపాలనలో 100కు పైగా వైఫల్యాలను జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసిందని విమర్శించారు. రివర్స్ టెండరింగ్, రాజధాని, మచిలీపట్నం పోర్టు విషయంలో రివర్స్ నిర్ణయాలు, అవినీతి అంటూ ఆరోపణలు చేసిన జగన్, ఏ ఒక్క అవినీతిని బయటపెట్టలేకపోయారు. రాజధానిని తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజీలో పెట్టారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ అది మర్చిపోయారు. బీమా లేదు, అన్నా క్యాంటీన్లు లేవు, పెన్షన్ నామమాత్రంగా రూ.250 పెంచారని, మీరు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇదే మాయలో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారంటూ విమర్శలు గుప్పించారు.