మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (17:51 IST)

పులివెందుల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా : ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి

basmati rice
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల కేంద్రంగానే రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతుందని ఏపీ పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్‌కు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రాశారు. అనంతపురం జిల్లా సరిహద్దులలో ఉండడంతో అక్రమ రవాణాకు, బియ్యం నిల్వలకు వీలుగా ఉంటుందన్న కారణంతో స్మగ్లర్లు పులివెందుల ప్రాంతాన్ని తమ స్థావరంగా మార్చుకున్నారని వివరించారు. 
 
2019 నుంచి గత ప్రభుత్వ హయాంలో స్మగ్లింగ్‌కు పాల్పడినవారే, ఇప్పుడు కూడా స్మగ్లింగ్ చేస్తున్నారని రాంగోపాల్ రెడ్డి వివరించారు. వేంపల్లి, ముదిగుబ్బ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు ఈ అక్రమ రవాణాలో కీలకంగా ఉన్నారన్నారు. ముదిగుబ్బకు చెందిన వైసీపీ నేత మిత్రమనాయుడు గత ఐదేళ్లుగా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించాడని తెలిపారు. 
 
ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే ఈ స్మగ్లర్ల ఆదాయం నెలకు రూ.కోటి వరకు ఉందన్నారు. అధికార యంత్రాంగం ఈ తంతును చూసీచూడనట్టు వదిలేస్తోందని, చిన్నచిన్న కేసులతో సరిపెడుతున్నారన్నారు. బియ్యం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్లను కోరారు. 
 
పులివెందుల నుంచి అనంతపురం జిల్లాకు ఉన్న సరిహద్దులో నిఘా పెంచాలని విజ్ఞప్తి చేశారు. పులివెందుల ప్రాంతంలోని రైస్ మిల్లులు, బియ్యం గోదాముల్లో నిత్యం నిఘా ఉంచాలని, అక్రమ రవాణా గురించి తెలిసినా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని రాంగోపాల్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.