బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 మార్చి 2024 (16:39 IST)

రాష్ట్ర వ్యాప్తంగా తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వండి : డీజీపీకి చంద్రబాబు లేఖ

chandrababu
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్‌లలో తనపై నమోదైన కేసుల వివరాల జాబితాను ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలు పేర్కొనాల్సివుంది. పైగా, ఉద్దేశపూర్వకంగా దాచిపెడితే ఎన్నికల్లో గెలిచినప్పటికీ అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అందువల్ల తనపై నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. అధికార పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఇందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ముందుచూపుతో చంద్రబాబు ఏపీ డీజీపికి లేఖ రాశారు.
 
కాగా, డీజీపీకి చంద్రబాబు రాసిన లేఖలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాలి. బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా గడిచిన ఐదేళ్లుగా ప్రజాసమస్యలపై తాను పోరాడుతున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తనపై పలు అక్రమ కేసులు పెట్టించిందని ఆరోపించారు. 
 
రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను అధికారులు తనకు తెలియజేయలేదని చెప్పారు. ఆయా పోలీస్ స్టేషన్లకు వ్యక్తిగతంగా వెళ్లి సమాచారం పొందడం ఆచరణలో సాధ్యం కాదు, కాబట్టి మీ ఆఫీసు నుంచి సమాచారం కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఈ లేఖ కాపీని రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సీఐడీ విభాగాలకు కూడా చంద్రబాబు పంపించారు. ఇదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా డీజీపీకి లేఖ రాయనున్నట్టు తెలుస్తుంది.