శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (13:08 IST)

ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు : తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఆంధ్రా వ్యాపారులపై తెలంగాణ రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మరోమారు తనలోని అక్కసు వెళ్లగక్కాడు. ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్ళు అంటూ మండిపడ్డారు. పైగా, విద్యను వ్యాపారం చేసి రూ.కోట్లు వెనకేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
రిషి నీట్‌, మెడికల్‌ అకాడమీకి చెందిన విద్యార్థులు మెడిసిన్‌లో 30 సీట్లు సాధించిన సందర్భంగా మహబూబ్‌నగర్‌లోని నేషనల్‌ ఫంక్షన్‌ హాల్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, 'ఆంధ్రా వ్యాపారులు పచ్చి మోసగాళ్లు. విద్యార్థులకు మంచి చదువు అందిస్తామని చెబుతూ మనల్ని నమ్మించి మోసం చేస్తున్నారు. వారి ఊబిలో ఎవరూ పడకూడదు' అని అన్నారు. 
 
తెలంగాణ ప్రాంత ప్రజలు విశ్వాసం కలిగి ఉంటారని, ఎవరినీ మోసం చేయరన్నారు. నమ్ముకుంటే ప్రాణమైనా ఇస్తారన్నారు. ఆంధ్రాకు చెందిన కొందరు విద్యను వ్యాపారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా శ్రీనివాస్ గౌడ్ ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న విషయం తెల్సిందే.