మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, అందుకుతోడుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలి పారు.
కాగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్ మీదుగా బీహార్ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
అరేబియా సముద్రంలోని హికా తుపాను వల్ల వర్షాలు కురుస్తున్నాయన్న ప్రచారం నిజం కాదని, హికా తుఫాను ఒమన్ వద్ద తీరం దాటి బలహీనపడిపోయిందని అధికారులు తెలిపారు.
ఏపీ, తెలంగాణాలో భారీ వర్షాలకు హికా తుఫాను కారణం కాదని, ఉపరితల అవర్తనానికి తూర్పు గాలులు తోడై బలమైన రుతుపవనాలు వ్యాపించడంతో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.